దేశంలో ఎక్కడ .. ఏ ఎన్నిక జరిగినా.. అక్కడ గెలిస్తే… మొట్టమొదటి క్రెడిట్ వెళ్లిపోయేది ప్రధానమంత్రి నరేంద్రమోదీకి. త్రిపురలో గెలిచినా.. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. అందరూ మొదటగా.. నరేంద్రమోదీ పేరును తలచుకుని.. ఆ తర్వాతే వేరే ఏమైనా ప్లస్ పాయింట్లు ఉంటే చెబుతారు. అంతగా బీజేపీ విజయాలను..మోదీకి అంకితం చేసేశారు బీజేపీ నేతలు. అదే విధంగా ఓటముల్ని మాత్రం… ఆయన ఖాతాలో వేయడం లేదు. కనీసం ఆ ఆలోచన చేయడానికి కూడా బీజేపీ నేతలకు థైర్యం రావడం లేదు.
భారతీయ జనతా పార్టీ 2014లో 282 లోక్సభ సీట్లను దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న లోక్సభ సభ్యులు 272 మంది మాత్రమే. ఈ నాలుగేళ్ల కాలంలో 27లోక్సభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే..అందులో కేవలం ఐదంటే.. ఐదు లోక్సభ స్థానాలను మాత్రమే.. బీజేపీ గెలుచుకోగలిగింది. దాదాపుగా ఎనిమిది సిట్టింగ్ స్థానాల్లో పరాజయం పాలైంది. లోక్సభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయంటే.. అది కేంద్ర ప్రభుత్వ పాలనపై ఓ రకంగా ప్రజాభిప్రాయం లాంటిది. అలాంటి లోక్సభ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోతూ వస్తోంది. వరుసగా సిట్టింగ్ స్థానాలను పోగొట్టుకుంటున్నా… ఆ ఓటముల బాధ్యతను.. నరేంద్రమోదీపై మోపేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధపడటం లేదు.
కర్ణాటకలో గుడ్డిలో మెల్లగా అతి పెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది. కానీ బీజేపీ నేతలు మాత్రం తమ పార్టీ గెలిచిందని.. ఆ క్రెడిట్ అంతా నరేంద్రమోదీదేనని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పరిణామాల్లో … అక్కడ బీజేపీ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఇందులో మోదీ తప్పిదమేమీ లేదంటూ.. చెప్పుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. అక్కడ జరిగిన తప్పులకు.. యడ్యూరప్ప, మురళీధర్ రావు లాంటి వారే బాధ్యులన్నట్లు మాట్లాడారు. ఇప్పుడు ఉపఎన్నికలు ఫలితాలొచ్చాయి. యూపీ నుంచి కేరళ వరకూ.. పదకొండు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ పతనం చాలా వేగంగా సాగుతోందని నిరూపణ అయింది. ఇప్పుడు కూడా.. మోదీపై ఓటముల బాధ్యతల్ని పెట్టడానికి బీజేపీ నేతలు సిద్ధపడటం లేదు.
ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి.. అక్కడికక్కడే పోస్ట్ మార్టం చేసి.. స్థానిక పరిస్థితులు, విపక్షాల పొత్తుల వల్లే ఓడిపోతున్నామని నివేదికలు సిద్దం చేసుకున్నారు. విపక్షాలు కలసికట్టుగా మారినా.. బీజేపీ ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయిన విషయాన్ని మరుగున పడేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి కీలకమైన చోట్ల.. అక్కడి నాయకత్వంపై నిందలేసి.. బలి చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బీజేపీలో గెలుపంతా..మోదీ ఖాతాలోకి… ఓడిపోతే.. ఆయా రాష్ట్రాల నాయకత్వం నెత్తి మీద వేస్తున్నారు. దీనిపై ఆ పార్టీలో ఎవరూ నోరు మెదిపే పరిస్థితి కూడా లేదు.