జీవీఎల్ నరసింహారావు, రామ్‌మాధవ్, మురళీధర్ రావులను పార్టీ పదవుల నుంచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తొలగించారు. కొత్త కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. ఈ జాబితాలో ఈ ముగ్గురికీ చోటు లభించలేదు. ఏపీ నుంచి పురందేశ్వరికి జాతీయప్రధాన కార్యదర్శిహోదా ఇచ్చారు. అలాగే ప్రస్తుతం జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్‌కు మళ్లీ అదే పదవి ఇచ్చారు. తెలంగాణ నుంచి డీకే అరుణకు జాతీయ స్థాయిలో బీజేపీ ఉపాధ్యక్ష పదవి లభించింది. ఇక నిన్నామొన్నటిదాకా తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగాపని చేసిన లక్ష్మణ్‌ను జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. జేపీ నడ్డా అధ్యక్షుడయిన తర్వాత పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు.
12 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, 13 మంది కార్యదర్శులు, 23 మంది అధికార ప్రతినిధులతో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. 23 మంది అధికార ప్రతినిధుల్ని నియమించినప్పటికీ.. జీవీఎల్ నరసింహారావుకు మాత్రం చోటు దక్కలేదు. దీంతో ఆయన సాదాసీదా ఎంపీగా పార్టీలో మిగిలనున్నారు. బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యులకు కీలక బాధ్యతలు ఉంటాయి. రాష్ట్రాల వారీగా పార్టీ వ్యవహారాలను వారికే అప్పగిస్తారు. రామ్ మాధవ్, మురళీధర్ రావు ఆరెస్సెస్ నుంచి నేరుగా బీజేపీలోకి వచ్చి ప్రధాన కార్యదర్శులయ్యారు. చాలా రాష్ట్రాల బాధ్యతలు తీసుకున్నారు. గెలుపు కూడా సాధించి పెట్టారని చెప్పుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో వారి పనితీరుపై నెగెటివ్ రిమార్కులు పడ్డాయి. అదే సమయంలో వారిని పార్టీ బాధ్యతల నుంచి తప్పించి..కేంద్ర మంత్రులుగా చాన్సిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ తరణంలో వారికి పార్టీ పదవులు దక్కలేదు.
వీరిద్దరికీ కేంద్రమంత్రి పదవులు ఇచ్చినా.. జీవీఎల్‌కు మాత్రం.. ఆ చాన్స్ కూడా లేదని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. మొత్తంగా కార్యవర్గంలో ఏపీ నుంచి ఇద్దరికి..తెలంగాణ ఇద్దరికి చోటు లభించింది. రామ్‌మాధవ్, మురళీధర్ రావులకు ప్రమోషన్ ఇవ్వడానికి పార్టీ బాధ్యతల నుంచి తప్పించారా.. లేక… పక్కన పెట్టడానికి చేశారా అన్నది త్వరలో నిర్ణయం కానుంది. ఎందుకంటే.. మొన్నదే రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. వారికి మంత్రి పదవులు ఇస్తే.. రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది. దానికి అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయి.