తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా అవినీతి ఆరోపణలపై కేంద్రం విచారణ కమిటీలు, దర్యాప్తు అధికారుల్ని నియమిస్తోంది. ఆ అధికారం ఉందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. కానీ భారీగా అవినీతి జరిగిందని అనుమానం చోట్ల విచారణకు ఇప్పటి వరకూ అనేక అడ్డంకులు ఉన్నాయి. వాటిని ఏదో విధంగా తొలగించుకుని విచారణ దారులు సృష్టించుకుంటోంది కేంద్రం. అందులో భాగంగానే తాజాగా మిషన్ భగీరథ అంశంలో అవినీతి జరిగిందని నిర్ధారించుకోవడం. ఇప్పటికే ధాన్యం అవకతవకల్లో ఎఫ్సీఐ విచారణ జరుపుతోంది. ప్రాథమికంగా అవినీతి జరిగిందని ఇప్పటికే తేల్చారు. ఇక తర్వాత ప్రాజెక్టుల మీదకు రావొచ్చు. ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థలపై దాడులు జరుగుతున్నాయి.
మిషన్ భగీరథ అయినా ప్రాజెక్టుల్లో అవినీతి అయినా.. ధాన్యం అవకతవకలైనా విచారణ జరిపే అధికారం కేంద్రానికి లేదు. మిషన్ భగీరథ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఖర్చు. కేంద్ర నిధులు ఉంటే విచారణ చేయించడానికి అవకాశం ఉండేది.కేసీఆర్ అలాంటి అవకాశం ఇవ్వలేదు. కాళేశ్వరం లాంటిప్రాజెక్టు కూడా అంతే . కేంద్రం రూపాయి ఇవ్వలేదు. నిజానికి ఈ రెండింటికి ఆర్థిక సాయం చేయాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫార్సు చేసింది.కానీ పైసా ఇవ్వలేదు. ఒక వేళ ఇచ్చి ఉంటే.. తాము ఇచ్చిన నిధులు అవినీతి పాలయ్యాయని సీబీఐ విచారణ జరిపించేవారేమో. ధాన్యం సేకరణ అయినా అంతే. ఎఫ్సీఐకి చర్యలు తీసుకునే అధికారం లేదు.
అయినా ఇప్పుడు వివిధ మార్గాల ద్వారా విచారణ అవకాశాల్ని బీజేపీ సృష్టించుకుంటోంది. బక్కా జడ్సన్ అనే వ్యక్తి లేఖ రాశారని మిషన్ భగీరధపై విచారణాధికారిని నియమించింది. ప్రాజెక్టుల్లో అవినీతిని కాంట్రాక్ట్ సంస్థలపై ఐటీ దాడుల ద్వారా బయటకు తీయడానికి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయింది. దాన్యం అవకతవకలపై సీబీఐ విచారణకూ మార్గం సుగమం చేసుకుంది. ఇక కేసీఆర్ను ఎప్పుడు కార్నర్ చేయాలంటే అప్పుడు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. దానికోసమే గ్రౌండ్ పిపరేషన్లని తెలంగాణ రాజకీయవర్గాలు నమ్ముతున్నాయి.