కొద్దిరోజులుగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ విస్తృత ప్రచారం జరుగుతోన్నా ఇరు పార్టీల్లో ఎవరూ కిక్కురుమనలేదు. దాంతో ఈ ప్రచారానికి ప్రాధాన్యత ఏర్పడింది. విస్తృత స్థాయిలో ఈ ప్రచారం జరుగుతోన్నా నేతలు ఖండించడం లేదంటే తెర వెనక ఏదో జరుగుతుందని పొలిటికల్ సర్కిల్లో చర్చ మొదలైంది.
విషయం మరింత సీరియస్ కావడంతో కేటీఆర్ ఈ ప్రచారాన్ని ఎక్స్ వేదికగా ఖండించేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేటీఆర్ ఖండించినా బీజేపీ వైపు నుంచి ఎవరూ ఖండించకపోవడం చర్చనీయాంశం అయింది. బీఆర్ఎస్ వైపు నుంచి విలీనం కోసం ప్రయత్నాలు జరుగుతోన్నా బీజేపీలో ఏకాభిప్రాయం లేకే ఈ వ్యవహారం ఎటు తేలడం లేదన్న టాక్ నడిచింది.
మరోవైపు.. ఇదే విషయాన్ని ముందుంచి బీజేపీ – బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. రెండూ ఒకే గూటి పక్షులు అంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. కేటీఆర్ – హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనక అసలు ఎజెండా ఇదేనంటూ ఆరోపిస్తోంది. విలీనంకు సంబంధించిన ఈ విషయంలో ఇరు పార్టీలను ఇరుకున పెట్టడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. దాంతో బీజేపీ స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది.
ఈ విలీనం వార్తలను తాజాగా కేంద్ర మంత్రి , రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించిన కొద్దిసేపటికే మరో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అలాంటిదేమీ లేదన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎలాంటి చర్చలు జరగలేదని, అదంతా ప్రచారమేనని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై స్పందించకపోతే బీఆర్ఎస్ తోపాటు బీజేపీ కూడా ఇరుకున పడే ప్రమాదం ఉందని కమలనాథులు గ్రహించినట్టు ఉన్నారు. అందుకే ఆలస్యంగా ఈ విలీనం వార్తలను ఖండించారని అంటున్నారు.