ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ బీజేపీ దొరికిపోయింది. వాళ్లు మా వాళ్లా..? సాక్ష్యాలేవి ? డబ్బులేవి ? అని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగవచ్చు కానీ.. ప్రజలకు మాత్రం క్లారిటీ వచ్చింది. కేసీఆర్ చేయలేదా.. కేసీఆర్ కొనలేదా అని ఎదురుదాడి చేసే వాళ్లు.. బీజేపీ అభిమానులు ఇలా కొనడాన్ని సమర్థిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్లో ఇదే పద్దతిలో చేర్చుకుని కూడా… బీజేపీ తీరును టీఆర్ఎస్ నేతలు .. కార్యకర్తలు విమర్శిస్తున్నారు. అయితే ఇక్కడ దొరికినవాడే దొంగ. పట్టించిన వాడే హీరో. అందుకే ఇప్పటికైతే బీజేపీనే దోషి. కోర్టులో ఏమీ తేలకపోయినా.. ప్రజాకోర్టులో బీజేపీని దోషిగా నిలబెడుతోంది టీఆర్ఎస్.
ప్రజల ముందు ఆధారాలు పెడుతున్న టీఆర్ఎస్ !
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో న్యాయస్థానంలో ప్రాథమికంగానే సరైన సాక్ష్యాలు లేవన్న కారణంగా నిందితులను రిమాండ్కు తిరస్కరించారు. ఈ విషయంలో టీఆర్ఎస్ పెద్దగా టెన్షన్ పడటం లేదు. మెల్లగా ఆడియోలు లీక్ చేస్తోంది. మరి ఇదే ఆడియోల్ని.. ఇంకా ఉన్నాయని చెబుతున్న వీడియోల్ని ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం లేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కోర్టులో పెట్టాల్సిన సమయంలో పెడతారని.. అంతకంటే ముందు బీజేపీ కొనుగోలు స్వామ్యాన్ని ప్రజాకోర్టులో పెట్టాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ప్రజలే నిర్ణయం తీసుకోవాలని కోరే అవకాశం !
రాజకీయాల్లో ఏం జరిగినా అంతిమంగా తీర్పు చెప్పాల్సింది ప్రజలే. రాజకీయ నేతలు తీర్పు కోరాల్సింది కూడా ప్రజాకోర్టులోనే. ఇక్కడ బీజేపీ తీరును టీఆర్ఎస్ ప్రజల ముందు ఉంచాలనుకుంది. వారిని నేరస్తులుగా చేసి.. చట్టం ముందు శిక్షించడం అనే దానికి ప్రాధాన్యం ఇచ్చినా.. ఇప్పుడల్లా జరిగేది కాదు. మన దేశంలో కోర్టు కేసులు తేలాలంటే చాలా కాలం పడుతుంది. చివరికి ఆ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో అంచనా వేయడం కష్టం. అంత కంటే ముందే ఈ విషయాలను ప్రజల ముందు ఉంచారని.. వారే నిర్ణయం తీసుకుంటారని దోషులకు శిక్ష విధిస్తారని టీఆర్ఎస్ అధినేత నమ్మకంతో ఉన్నారని చెప్పుకోవచ్చు.
అన్ని పార్టీలూ అంతే.. దొరికినవాడే దొంగ !
ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో టీఆర్ఎస్ అధినేతది అందే వేసిన చేయి. టీడీపీని లేకుండా చేయడంలో ఆయన పన్నిన వ్యూహాల గురించి టీఆర్ఎస్ నేతలకు కథలు కథలుగా తెలుసు. రెండో విడతలో కాంగ్రెస్ నిర్వీర్యం చేయడానికి ఆయన ఏం చేశారో ఇంకా బాగా తెలుసు. విశేషం ఏమిటంటే ఆయన రైట్ రైయల్గా అలా చేశారు. ఎవరికీ దొరకలేదు. కానీ తమ ఎమ్మెల్యేలపై ఎవరైనా కన్నేస్తే మాత్రం ఆయన ఊరుకోలేదు. పట్టేసుకున్నారు. తమ ఎమ్మెల్యేలందర్నీ లాక్కున్నారని ఓ నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు అయినా పొందుదామని రేవంత్ చేసిన ప్రయత్నం .. ఆయన రాజకీయ జీవితాన్ని మసకబార్చేలా చేసింది. ఇప్పుడు అది బీజేపీ వంతు. అప్పుడు రేవంత్.. ఇప్పుడు బీజేపీ దొరికారంతే.. టీఆర్ఎస్ దొరకలేదు.