రాజమౌళి దర్శకత్వంలో రెడీ అవుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాకు తెలంగాణ బీజేపీ నేతలు ప్రచార బాధ్యతలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. భీంపాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ లుక్.. ముస్లిం యువకుడిని పోలి ఉండటంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కుమ్రం భీం సినిమాను రాజమౌళి విడుదల చేస్తే.. సినిమా రీళ్లను తగులబెడతాని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా ఎలా నడిపిస్తారో చూస్తామని సవాల్ చేశారు. హిందూమతాన్ని అవమానపరిస్తే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించారు.
ఇక ఆదివాసీ వర్గానికి చెందిన ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు మరింత వయోలెంట్‌గా ఉన్నారు. భీం పాత్రకు పెట్టిన టోపీ, కుర్తా తొలగించాలని.. భీంను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం అవమానించడమేనని అంటున్నారు. అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగులబెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే సహించేది లేదని అంటున్నారు. బీజేపీ నేతల ఘాటు హెచ్చరికలతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల్లో హాట్ టాపిక్ గా ఉన్న ట్రిపుల్ ఆర్ మరింతగా చర్చనీయాంశం అవుతోంది. నిజానికి అసలు కథేంటో ఎవరికీ తెలియదు.
అందులో భీం పాత్రేంటో కూడా యూనిట్ కు తప్ప ఎవరికీ తెలియదు. ఇలాంటి సమయంలో.. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ చూసి బీజేపీ నేతలు ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. అయితే.. ఈ వివాదం విషయంలో సినిమా యూనిట్ గుంభనంగా ఉంటుంది. తమ సినిమా గురించి ఎంత చర్చ జరిగితే అంత మంచిదన్నట్లుగా ఉంది. అందుకే పూర్తిగా షూటింగ్ పైనే దృష్టి కేంద్రీకరించారు.