తెలంగాణ బీజేపీలో కనిపించని అంతర్గత సంక్షోభానికి… ఆ పార్టీ హైకమాండ్ తాడో పేడో అన్న రీతిలో చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఉండేవాళ్లు ఉంటారని.. పోయేవాళ్లు పోతారని.. బండి సంజయ్ ను మార్చేది లేదని ప్రకటించేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడ్ని మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ చుగ్ ముగింపు పలికారు. బండి సంజయ్‌ని మార్చేది లేదని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టత ఇచ్చిందని ప్రకటించారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
ఇటీవల తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈటల రాజేందర్ ను హైకమాండ్ వరుసగా రెండు, మూడు సార్లు ఢిల్లీ పిలిపించడంతో ఆయనను బీజేపీ చీఫ్ ను చేస్తారని.. బండి సంజయ్ ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం ప్రారంభమయింది. బండి సంజయ్ ఏకపక్షంగా పార్టీని నడుపుతున్నారని.. పూర్తి స్తాయిలో మత ప్రస్తావన తెస్తూ.. బీజేపీకి చేటు చేస్తున్నారని నివేదికలు సమర్పించారు. ఈ కారణంగానే పార్టీలో చేరికలు ఉండటం లేదన్నారు. బండి సంజయ్ తీరుపై చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఇటీవల వరుసగా ఆ పార్టీ నుంచి.. కాంగ్రెస్ లోకి చేరికలు ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.
వీరంతా వెళ్లిపోతే పార్టీ మళ్లీ మునుపటి స్థాయికి వస్తుందన్న ఆందోళనతో ఉన్న బీజేపీ పెద్దలు.. ఈటల రాజేందర్ ను చీఫ్ ను చేయాలన్న ఆలోచన చేసినట్లుగా చెబుతున్నారు.కర్ణాటక ఎన్నికల తర్వాత ఇలాంటి ఆలోచన చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఇలాంటి మార్పులు పార్టీకి ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయం వినిపించడంతో హైకమాండ్ వెనక్కి తగ్గినట్లగా తెలుస్తోంది. ఇక ఆ పార్టీ సీనియర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వారిష్టమని తేల్చేసుకున్నారు.