తెలంగాణలో మోదీ సభకు పవన్ కల్యాణ్ హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇద్దరూ పవన్ ఇంటికి వెళ్లి సమావేశమైన తర్వాత జనసేన చేసిన అధికారిక ప్రకటనలో.. మోదీ సభకు హాజరు కావాలని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కోరారని… పవన్ అంగీకరించారని తెలిపారు. మోదీ మూడో సారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు.
ఏడో తేదీన హైదరాబాద్ లో బీసీ ఆత్మగౌరవసభను నిర్వహిస్తున్నారు . ఈ సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. బీసీ నినాదాన్ని అందుకున్న బీజేపీ… పవన్ కల్యాణ్ కు మున్నూరు కాపుల్లో మంచి ఫాలోయింగ్ ఉందని.. ఆయన చెబితే ఓట్లన్నీ గుంపగుత్తగా వేస్తారని గట్టిగా నమ్ముతోంది. అందుకే పవన్ కల్యాణ్ కు ప్రత్యేక గౌరవమర్యాదలు.. గతంలో ఎప్పుడూ ఇవ్వనంతగా ఇస్తున్నారని అంటున్నారు . ఈ క్రమంలో మోదీతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తొమ్మిది సీట్లు ఇస్తామని బీజేపీ నేతలు … జనసేన వద్ద బేరం పెట్టారు. 32 నుంచి 12 సీట్లకు అక్కడ్నుంచి 9 సీట్లకూ వచ్చారు. దానికి కూడా పవన్ కల్యాణ్ అంగీకరించారు. అయితే సీట్ల విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కూకట్ పల్లి , శేరిలింగం పల్లి విషయంలో బీజేపీలో ఎవరూ ఊహించనంత చిచ్చు రేగింది. ఇతర సీట్లలోనూ అదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అందుకే.. బుజ్జగింపుల కోసం వాయిదా వేస్తున్నారు. నామినేషన్లు ప్రారంభమై కూడా మూడు రోజులు ముగిసింది. ఇక నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ లోపు స్థానాలు ఖరారు కావాలి. .. అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి.. ప్రచారం చేసుకోవాలి.
పవన్ కు సీట్లిస్తేనే తమ తరపున కూడా ప్రచారం చేస్తారని లేకపోతే.. చేయరని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే … చివరి వరకూ బేరాలాడి ఎన్ని తక్కువ వీలైతే అన్ని తక్కువ సీట్లు ఇవ్వాలనుకుంటున్నారని అంటున్నారు. కారణం ఏదైనా … తెలంగాణలో జనసేన మద్దతు కోసం బీజేపీ ఊహించనంతగా తహతహలాడుతోంది.