తప్పుడు ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు అనుభవించాల్సిందేనని కేసీఆర్కు బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ విస్తారక్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన తన ప్రసంగంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసును పరోక్షంగా ప్రస్తావించారు. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని.. వీటికి ఖచ్చితంగా అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. తన పేరు తెలంగాణలో ఒక్కరికీ తెలియదని..కానీ ఫామ్ హౌస్ కేసు పేరుతో తప్పుడు ఆరోపణలు చేసి అందరికీ తెలిసేలా చేశారన్నరు. తనపై చేసిన ఆరోపణలకు ప్రభుత్వమే సమధానం చెప్పాలన్నారు.
బీఎల్ సంతోష్ హెచ్చరికను బీఆర్ఎస్ తేలికగా తీసుకోలేదు. కేసీఆర్ కూడా తేలికగా తీసుకోలేరు. ఎందుకంటే.. బీజేపీలో అత్యంత పవర్ ఫుల్ వ్యక్తుల్లో బీఎల్ సంతోష్ ఒకరు. ఆయన పూర్తిగా పార్టీ కోసమే పని చేస్తూంటారు. ఆయనను నేరుగా కేసీఆర్ టార్గెట్ చేశారు. సిట్ ద్వారా నోటీసులు జారీ చేయించి.. అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ పెద్దలకూ ఆగ్రహం తెప్పించిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఫామ్ హౌస్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది.. వెంటనే హైకోర్టు ద్వారా కేసు సీబీఐకి వెళ్లింది. అంటే ఇప్పుడు కేసీఆర్ చేతిలో ఉన్న ఆయుధం సీబీఐకి వెళ్లింది.
ఇప్పుడు సీబీఐ ఈ కేసును ఎలాంటి మలుపులు తిప్పాలనుకున్నా తిప్పుగలుగుతుందన్న విషయం రాజకీయవర్గాలకు తెలుసు. ఈ క్రమంలో బీఎల్ సంతోష్ చేసిన హెచ్చరికలుు బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క ఫామ్ హౌస్ కేసే కాదు.. ఢిల్లీ లిక్కర్ స్కాంతో పాటు రోహిత్ రెడ్డి ఆస్తుల వ్యవహారాలు కూడా ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు మరింతగా చిక్కులు పెరిగే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.