ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో పార్టీ మారాలనుకొంటున్న కాంగ్రెస్ నేతలు వైకాపాలోకో లేకపోతే తెరాసలోకో మారడం గమనిస్తే కొన్ని విషయాలు అర్ధమవుతాయి. ప్రస్తుతం తెలంగాణాలో తెరాసయే అధికారంలో ఉంది కనుక వచ్చే ఎన్నికలలో కూడా మళ్ళీ ఆ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వారు నమ్ముతునందునే తెరాసలోకి జేరుతున్నట్లు భావించవచ్చును. కానీ ఆంధ్రాలో అధికారంలో ఉన్న తెదేపాలో చేరకుండా వైకాపాలో చేరడం గమనిస్తే వారికి వైకాపా అధికారంలోకి వస్తుందనే నమ్మకం అయినా ఉండాలి లేదా తెదేపా ఇప్పటికే నిండిపోయుంది కనుక అందులోకి ఎంట్రీ దొరకనందున వైకాపాలోకి జేరుతున్నట్లు భావించవలసి ఉంటుంది. కానీ అటువంటప్పుడు వారు తెదేపాకు ప్రత్యామ్నాయంగా ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరే ఆలోచన చేయకుండా వైకాపాలోనే చేరుతున్నారు. అంటే ఆంధ్రా, తెలంగాణా రెండు రాష్ట్రాలలో కూడా బీజేపీ ఎన్నటికీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని వారు రూడీ చేసుకొన్నట్లే భావించవచ్చును.
వారి సంగతి ఎలా ఉన్నా రెండు రాష్ట్రాలలో బీజేపీ నేతలు తమ పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదనే విషయం కూడా దీని వలన రుజువవుతోంది. అందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు రాష్ట్రాల నేతలకు చివాట్లు పెట్టినట్లున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపాతో బీజేపీకి పొత్తు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున అక్కడ బీజేపీ నేతలు తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండవచ్చును. కానీ తెలంగాణాలో తెరాసతో బీజేపీకి ఎటువంటి సంబంధమూ లేదు. అయినా ఆ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని నిలదీయడంలో విఫలమవుతున్నారు. కారణాలు ఎవయినప్పటికీ రెండు రాష్ట్రాలలో బీజేపీని బలోపేతం చేసుకొనేందుకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు లేదు.
బీహార్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీయు పార్టీతో సహా ఆరు పార్టీలు కలిసి జనతా పరివార్ గా అవతరించాయి. వాటితో కాంగ్రెస్ పార్టీ కూడా జత కట్టింది. అంటే మొత్తం ఏడు పార్టీలను బీజేపీ ఒక్కటే ఎదుర్కోవలసి ఉంటుందన్న మాట. అయినా రాష్ట్ర బీజేపీ నేతలు తమ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచించిన విధంగా పనిచేసుకొనిపోవడంతో, ఇటీవల జరిగిన విధానసభ ఎన్నికలలో మొత్తం 24 సీట్లలో బీజేపీ ఏకంగా 12 సీట్లు కైవసం చేసుకోగలిగింది. అధికార జేడీయు కేవలం 5, ఆర్.జేడీ :3, కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగాయి. కానీ ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో బీజేపీ నేతలు కనీసం తెరాస, వైకాపాలలోకి వెళ్లిపోతున్న కాంగ్రెస్ నేతలను కూడా ఆకర్షించలేకపొతున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకి కేంద్రప్రభుత్వం మంజూరు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి పధకాలు, వాటికి విడుదలవుతున్న నిధులను తామే సాధించామని అధికార తెదేపా, తెరాస నేతలు గొప్పగా చెప్పుకొంటుంటే, బీజేపీ నేతలు కిమ్మనకుండా చూస్తూ కూర్చోవడం విచిత్రమనుకొంటే, కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అనేక పధకాలను ప్రారంభించేందుకు ఎవరూ తమను ఆహ్వానించకపోయినా బీజేపీ నేతలు కిమ్మనకపోవడం మరో విచిత్రం. కేంద్రంలో బీజేపీఏ అధికారంలో ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాలలో బీజేపీ నేతలు ఈ అవకాశాన్ని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు లేదు. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలలో తమ పార్టీని బలపరుచుకోవాలనే తపన, వారిరువురు ప్రదర్శిస్తున్న ఉత్సాహం ఏమాత్రం రెండు రాష్ట్రాల బీజేపీ నేతలలో కనబడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది.వారు ఇదే విధంగా కాలక్షేపం చేస్తూ ఉంటే, రెండు రాష్ట్రాలలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించడం కల్ల.