కాబోయే రాష్ట్రపతి ఎన్నికపై ప్రతిపక్షాలతో చర్చల ప్రహసనం తేలిపోయింది. కాంగ్రెస్ అద్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమైన బిజెపి మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్య నాయుడు ఎలాటి ప్రతిపాదన చేయకుండానే ప్రతిపక్షాల సహకారం కోరారట. బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అడిగితే అసలు వారెవరో తెలియకుండా ఏం చెబుతామని కాంగ్రెస్ స్పందించింది. నిజంగానే చాలా తమాషా అయిన పరిస్థితి ఇది. రాష్ట్రపతి పదవికి వ్యక్తులు పోటీ చేస్తారు తప్ప పార్టీల పరంగా వుండదు. ఆ వ్యక్తి ఎవరో చెప్పకపోతే ఇక చర్చ ఏముంటుంది? గేదెను నీళ్లలో పెట్టి బేరమాడినట్టే వుంటుంది! మాకు మెజార్టి వుంది గనక మీరు బలపర్చండి అని అడగడమే బిజెపి ఉద్దేశం కావచ్చు. అవతలి వారి వ్యూహాలుతెలుసుకోవడమూ కావచ్చు. ఏమైనా పేరు లేని చర్చ అర్థరహితమే. అవతలి పేరు రాకుండా ఇవతలివారూ చెప్పరు. ఈ రోజు ఉదయం నుంచి సుష్మాస్వరాజ్పేరు, నిన్న మెట్రో శ్రీధరన్ పేరు వినవచ్చాయి. అయితే వీరుభయులూ అభ్యర్థులయ్యే అవకాశాలు చాలా తక్కువ. మోడీ అమిత్ షా మనసులో ఎవరో వున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రతిపక్షాల సహాయ నిరాకరణే వారిని పోటీ పెట్టడానికి కారణం అని ఆరోపించేందుకే ఈ చర్చల ప్రహసనం. అన్నాడింఎంకెతో చర్చలు అంటున్నా వారెలాగూ బలపరుస్తారు. లౌకిక అభ్యర్తి వుండితీరాలని చెప్పే సిపిఎం కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ముందస్తు మద్దతు ప్రకటించే అవకాశం లేదు. సో ఈ ఘట్టం అయిపోయినట్టే.