ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు స్పందించడం లేదు. తమ మిత్రపక్షం భీమ్లానాయక్‌ను ప్రభుత్వం ఎలా రాచి రంపాన పెడుతోందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. కానీ ఒక్కరంటే ఒక్కరూ సంఘిబావం చెప్పలేదు. పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అందరూ తిరగబడాల్సిన సమయం అని ఓ ట్వీట్ చేసి పరోక్షంగా పిలుపునిచ్చినప్పటికీ బీజేపీ నేతలకు మాత్రం నోరు రాలేదు. భీమ్లా నాయక్‌పై ఏపీలో ఏర్పడిన నిర్బంధం అందరిలోనూ ఓ రకమైన భయానక భావన కల్పించింది. అక్కడ అధికార పార్టీ వాళ్లు తప్ప ఇంకెవరూ బతకకూడదన్న అభిప్రాయాన్ని కల్పించేలా ఆ పరిస్థితులు ఉన్నాయి.
కానీ బీజేపీ నేతలు మాత్రం దీన్ని ప్రశ్నించడానికి ముందుకు రావడం లేదు. నిజానికి ఇతర పక్షాల కన్నా బీజేపీనే ఎక్కువగా స్పందించాల్సి ఉంది. మిత్రుడిగా భరోసాగా ఉన్నామన్న భావన కల్పించాల్సి ఉంది. కానీ అలాంటి పనులేమీ చేయకపోగా తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ తీరు జనసేన నేతల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. ఇలాంటి మిత్రపక్షంతో కలిసి ఉండాల్సిన అవసరం ఏమిటన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా పొత్తు పెట్టుకుంటే ఎలాంటి ఉపయోగం లేకపోగా రాష్ట్ర రాజకీయాల్లో తమ నెత్తిన చేయి పెట్టే విధంగా వ్యవహరిస్తూండటం జనసేన నేతల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. భీమ్లా నాయక్ వ్యవహారం రెండు పార్టీల మధ్య మరింత గ్యాప్ పంచే అవకాశం కనిపిస్తోంది. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ముందుకు వచ్చారు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పవన్ గొప్ప నటుడని ఆయనను తొక్కేయలేరని సర్టిఫికెట్ ఇచ్చారు.