బీజేపీ సొంత నేతలకు మొండి చేయిచూపి.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తోంది. ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశం మొత్తం అదే చేస్తోంది. 111 మంది అభ్యర్థులతో విడుదలైన ఐదో లిస్టులో కొన్ని పేర్లు ఇంకా పార్టీలో చేరని వారివి కూడా ఉన్నాయి. మాజీ కాంగ్రెస్ కీలక నాయకులేగాక.. అసలు పార్టీలో లేని వారికి సైతం టికెట్లు వచ్చాయి. కేంద్ర మంత్రులు అశ్విని కుమార్ చౌబె, వి.కె సింగ్, పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ వంటి కీలక నాయకులు చోటు దక్కనివారిలో ఉన్నారు. సినీ నటులు కంగనా రనౌత్, అరుణ్ గోవిల్ కు టిక్కెట్లు ఇచ్చారు.
ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చారు. సీతా సొరెన్, తపస్ రాయ్, ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకున్న నవీన్ జిందాల్‌కు కురుక్షేత్ర సీటు, జితిన్ ప్రసాదాకు పిలిభిత్ స్థానాన్ని బీజేపీ కేటాయించింది. కేరళ బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్ర.. వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేయనున్నారు. కంగనా బీజేపీలో చేరక ముందే ఆ పార్టీ ఆమెకు టికెట్‌ను కేటాయించారు. రామాయణం టీవీ సీరియల్లో రాముడి పాత్రను పోషించిన అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. ఈయన 2021లో బీజేపీలో చేరారు
జార్ఖండ్‌లోని అధికార కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)ను వీడిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ సమీప బంధువు సీతా సొరెన్ కొన్ని రోజుల క్రితమే బీజేపీలో చేరారు. ఆమెకు టిక్కెట్ ఇచ్చారు. 2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు జగదీశ్ షెట్టర్‌కు బెలగావ్ సీటును కేటాయించింది. కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యారు పశ్చిమ బెంగాల్‌లోని తమ్లుక్ స్థానం టిక్కెట్ ఇచ్చారు. ఇలా సొంత పార్టీ నేతలపై నమ్మకం పెట్టుకోకుండా.. ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వడంపై బీజేపీలోనే వ్యతిరేకత వస్తోంది. కానీ మోదీ, అమిత్ షా మాటల్ని ధిక్కరించే వారు ఎవరూ లేరు.