తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హైడ్రా గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. హైడ్రాపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతుండగా..బీఆర్ఎస్ , బీజేపీలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. హైడ్రాపై నమ్మకం కుదరాలంటే కాంగ్రెస్ నేతల ఫామ్ హౌజ్ లను కూల్చివేయాలని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంటే.. ఇందులోనూ బీజేపీ తమ మార్క్ రాజకీయం చేయడం విమర్శల పాలౌతుంది.
హైడ్రా పేరుతో కాంగ్రెస్ హైడ్రామా చేస్తోందని.. దమ్ముంటే పాతబస్తీలో ఎంఐఎం అధినేత ఒవైసీకి చెందిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తన , మన అనే బేధం లేకుండా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుండగా.. ఇంకా ఓ సెక్షన్ నేతల కట్టడాలను కూల్చివేస్తేనే హైడ్రాకు విశ్వసనీయత ఉంటుందనే విధంగా కమలనాథులు కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
ప్రతి అంశాన్ని మత కోణంలో చూడటం ఏమంత మంచిది కాదని..కానీ బీజేపీ ఇప్పుడు ఇదే చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒవైసీ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేయడంతోపాటు అలా చేస్తేనే హైడ్రాకు విశ్వసనీయత ఉంటుంది అంటే.. ఇప్పటి వరకు అక్రమ కట్టడాల కూల్చివేతలను బీజేపీ వ్యతిరేకించినట్లే అవుతుందన్న అభిప్రాయం బలపడుతోంది.
మరోవైపు .. హైడ్రాపై బీజేపీ చేస్తోన్న విమర్శలపై కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో ధీటుగా సమాధానం ఇస్తున్నాయి . అక్రమ కట్టడాల నిర్మూలన కోసం తీసుకొచ్చిన హైడ్రాకు కూడా మతం రంగు పులిమేలా రాజకీయం చేయాలనుకోవడం దివాలాకోరు తనమని విమర్శలు గుప్పిస్తున్నారు.