ఈ మధ్య కొంతమంది టీడీపీ నేతలు వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. వారు ఏ కారణాలతో టీడీపీని వీడారు, వైకాపా నుంచి ఏం ఆశించి అక్కడ చేరారు అనేది ప్రజలందరికీ స్పష్టత ఉన్న అంశం. అయితే, ఈ అంశంపై భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహరావు స్పందించడం, అది కూడా పూర్తిగా వైకాపాను వెనకేసుకొస్తున్నట్టుగా వ్యాఖ్యానించడం విశేషం! ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్టిక్కర్ అంటించుకుని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. వచ్చే నెల నుంచి రైతులకు రూ. 2 వేలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం కావడంతో, అన్నదాత సుఖీభవ ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన నిధుల లెక్కలు ఏమయ్యాయంటూ ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేత జగన్ తన కుమార్తెను కలిసేందుకు లండన్ వెళ్తే, డబ్బు ఏర్పాట్ల కోసం వెళ్లారంటూ చంద్రబాబు ఆరోపించడం సరికాదని జీవీఎల్ అన్నారు! అదే లెక్క ప్రకారం టీడీపీ నాయకులు విదేశీ పర్యటనలకు వెళ్లేది కూడా డబ్బు ఏర్పాట్ల కోసమే అనుకోవచ్చా అంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ఆ పార్టీ నేతల్లోనే కొంతమంది నచ్చడం లేదనీ, అందుకే కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి బయటకి వస్తున్నారంటూ జీవీఎల్ వ్యాఖ్యానించారు. వైకాపాని వెనకేసుకుని వస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారనేది ఇక్కడే అర్థమైపోతోంది.
వాస్తవానికి, టీడీపీ నేతలు పార్టీలు మారుతున్నారా లేదా అనే అంశాన్ని పక్కన పెట్టి, సొంత పార్టీ గురించి జీవీఎల్ కొంత ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏపీలో భాజపాలో ఉంటున్న నేతలు ఎంతమంది..? వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్న నేతలు ఎంతమంది..? మాజీ మంత్రి కామినేని పోటీ అనుమానమే. విష్ణుకుమార్ రాజు సంగతి కూడా అటోఇటో అన్నట్టుగానే ఉంది. మాణిక్యాలరావు కూడా ఈసారి పోటీ చేస్తారో లేదో అనే మీమాంశ కొనసాగుతోంది. ఆకుల సత్యనారాయణ పార్టీ నుంచి బయటకి వెళ్లిపోయారు. ఈ లెక్కన ఏపీ భాజపా నుంచి ఎన్నికల బరిలో నిలవబోయేది ఎంతమంది..? ఈ పరిస్థితిపై జీవీఎల్ ఆలోచిస్తే… ఆయన్ని ఆంధ్రాకి పంపినందుకు కొంతైనా పార్టీకి ఉపయోగపడ్డ పనిచేసినట్టు అవుతుంది. అంతేగానీ… కొంతమంది టీడీపీ నేతలు వైకాపాలో చేరుతున్నారంటూ విమర్శలు చేస్తూ, ఆ పార్టీకి అనుకూలమైన సంకేతాలు ఇచ్చే విధంగా మాట్లాడుతుంటే భాజపాకి జీవీఎల్ వల్ల ఏ రకమైన ప్రయోజనమూ ఉండదు.