గ్రేటర్ ఎన్నిక్లలో పవన్ స్ట్రాటజీ వల్లే గెలియామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ గొప్పగా చెప్పారు. నిజామా అని జనసేన నేతలు కూడా ఇప్పుడు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే.. గ్రేటర్ ఎన్నికలు ముగియగానే పవన్ కల్యాణ్ ఎవరు అంటూ … నిజామాబాద్ ఎంపీ అర్వింద్ లాంటి వాళ్లు ఎగతాళి చేశారు. బండి సంజయ్ కూడా అంతే. అందుకే పవన్ కల్యాణ్ ఆ తర్వాత తెలంగాణ బీజేపీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. తర్వాత నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లోనూ పోటీ చేశారు. గౌరవం లేని చోట పొత్తులు ఉండబోవని ప్రకటించారు కూడా.
అయితే హఠాత్తుగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు పవన్ జపం చేస్తున్నారు. పవన్ వల్లే గెలిచామని చెప్పడంతో పాటు… పవన్ కల్యాణ్ తమ కోసం ప్రచారం చేస్తారని చెబుతున్నారు. తమ భాగస్వామి పార్టీ జనసేన అని లక్ష్మణ్ అంటున్నారు. జనసేన పార్టీకి ఏఏ సీట్లు ఇస్తారన్నదానిపై స్పష్టత లేదు. గ్రేటర్ పరిధిలో సీట్లు ఇవ్వొద్దని ముఖ్య నేతలు ఒత్తిడి చేస్తూండటంతో బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు ఇతర పార్టీలకు ఇవ్వాల్సి వస్తుందని, అయితే, రాష్ట్ర ప్రయోజనాలే కాకుండా దేశ ప్రయోజనాలు సైతం చూస్తామని చెప్పుకొచ్చారు.
మరో వైపు టీడీపీతో పొత్తుపై అడిగితే లక్ష్మణ్.. తమ పార్టీ కేవలం జనసేనతోనే పోటీ చేస్తోందన్నారు. టీడీపీ ఎందుకు ఎన్నికల నుంచి విరమించుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఇప్పటివరకూ కాంగ్రెస్ కు మద్దతిస్తామని ఎక్కడా చెప్పలేదని అన్నారు. టీడీపీ పోటీ నుంచి విరమించుకుంటే.. బీజేపీకే మేలు అని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కానీ బయట జరుగుతున్న ప్రచారం మాత్రం వేరేలా ఉంది.