బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాలన చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే ఆయన టీటీడీని నడుపుతున్న దాంట్లో పది శాతం అయినా ఏపీ ప్రభుత్వం నడిపితే చాలని ఆయన చెబుతున్నారు. టిటిడి చేపడుతున్న కార్యక్రమాలు, నిర్వహణ చాలా చక్కగా వుందన్నారు. శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత సుజనా చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎందుకంటే టీటీడీ తీరుపై బీజేపీ అధికారికంగా ఘాటు విమర్శలు చేస్తోంది. ఎన్నో హిందూ వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తోంది. అయితే సుజనా చౌదరి మాత్రం దానికి భిన్నమైన వాదన వినిపిస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఇప్పటికి ఎన్నో వివాదాల చుట్టూ నడుస్తోంది. ఇటీవల రేట్ల పెంపుపై వెలుగులోకి వచ్చిన వీడియో వైవీ సుబ్బారెడ్డి ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేసింది. అలాంటివి చాలా ఉన్నాయి. తిరుమల శ్రీవేంకటేశ్వరుడిదే అయినా అందులో కొత్తగా ఆంజనేయుని జన్మస్థానం కొండపైనేనని రచ్చ ప్రారంభించారు. తిరుమల గిరులను వివాదంలోకి లాగారు. అలాగే భక్తులకు శ్రీవారిని దూరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సుజనా చౌదరికి టీటీడీ పాలనలో ఏం నచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు. బహుశా ఆయనకు వీఐపీ రేంజ్లో స్వాగత సత్కారాలు.. దర్శనాలు ఏర్పాటు చేశారేమోనని దానికే ఆయన పొంగిపోయి సూపరని సర్టిఫికెట్ ఇచ్చి ఉంటారని బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి సుజనా చౌదరి వైవీ సుబ్బారెడ్డిపై ప్రశంసలు కురిపించినట్లుగానే భావిస్తున్నారు. దీని అర్థం ఏమిటో.. పరమార్థం ఏమిటో తేలాల్సి ఉంది.