శ్రీకృష్ణుడు అని పేరు పెట్టుకున్న వాడు.. నిజంగానే కృష్ణుని సద్గుణాలను పొందరు. అలాగే రాముడు పేరు పెట్టుకున్న వారూ అంతే. రావణాసురుడు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన అతను రాక్షసుడుకూడా కాడు. ఇదంతా ఎందకంటే పేరు అనేది గుర్తింపు కోసం పెట్టుకునేదే. అప్పటి కాలమాన పరిస్థితుల్లో ఆ పేర్లు పెట్టడం.. పెట్టుకోవడం.. యాధృచ్చికంగా రావడం జరిగి ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ పేర్లు పేరుతో ఎందుకు ప్రజల మధ్య చిచ్చి పెడుతున్నారనేదే ప్రశ్న.
వందేళ్లుగా స్థిరపడిపోయిన పేర్లతో ఇప్పుడు వచ్చిన ఇబ్బందేంటి?
గుంటూరులోని జిన్నాటవర్ … విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి… గోదావరిజిల్లాల ఆరాధ్యుడైన సర్ ఆర్థర్ కాటన్ ఇలా ఎవర్నీ బీజేపీ వదలడం లేదు. అందరికీ మతాలు అంటగట్టేసి.. పేర్లు మార్చాలని లొల్లి ప్రారంభించింది. ఓ రకంగా ఇది ఆలస్యంగా ఏపీకి వచ్చింది. కానీ దేశంలో ఎప్పటి నుండో ఉంది. ప్రజల్ని పేర్ల పేరుతో ఉద్వేగాలను రెచ్చగొట్టడం చాలా రోజుల నుంచి జరుగుతోంది. ముస్లిం పేర్లు కనిపిస్తే బీజేపీ నేతలకు పూనకమే వస్తోంది. ఆగ్రా కోట కట్టిన రాజులు ఇప్పుడు లేరు, ఆ రాచరికమూ లేదు. అలాగని వాటిని పడగొడతామా?
ఆ పేర్ల వల్ల దేశభక్తి తగ్గిపోయిందా? విద్వేషం పెంచుకునే అవకాశం దొరికిందా ?
విశాఖ కింగ్‌జార్జ్ హాస్పిటల్‌ను కట్టింది బ్రిటిష్ వారే కావొచ్చు. కానీ పేదప్రజలకు వైద్యసేవలు అందించే పెద్దాసుపత్రి అది. చేతనైతే ఆ వైద్యసేవలను మెరుగుపర్చాలిగాని, పేరు గురించి వివాదం దేనికి? జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని గట్టిగా ముందుకు తెచ్చి, పాకిస్తాన్ కావాలన్న డిమాండ్ లేవనెత్తాడు. ఆర్ఎస్ఎస్ కూడా అదే ద్విజాతి సిద్ధాంతాన్ని బలపరిచింది… బిజెపి అగ్రనేత అద్వానీ జిన్నాను ప్రశంసించిందీ అందుకే. ఏపీలో చిచ్చు రేపడం కోసం కాకపోతే… ఇప్పుడు అదే బిజెపి జిన్నా టవర్ పేరు గురించిన వివాదం రేపుతోంది. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది… కెజిహెచ్ పేరు మార్చడమో, జిన్నా టవర్ పేరు మార్చడమో కాదు.
దేశాన్ని కుల,మతాలుగా విభజించడమే వారి పని.. దానికి పేర్లైనా వాడుకుంటారు !
కొన్ని పేర్లు, చిహ్నాలను ప్రజలు అపురూపంగాను, మరికొన్నిటిని ఆధిపత్యానికి, దుర్మార్గానికి ప్రతీకలుగాను చూస్తారు. తిరుగుబాటు సమయాల్లో ప్రజలు తమ ఆగ్రహాన్ని ఆధిపత్య చిహ్నాలపై కూడా చూపిస్తారు. పేరులో పెన్నిధి లేకపోవచ్చు గానీ, పేరు మార్పు తగువులతో పెద్ద ప్రమాదం వుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.