రాష్ట్రపతి ఎన్నిక వ్యవహారాన్ని చాలా తెలివిగా నడిపిస్తున్నాననుకుంటోంది భారతీయ జనతా పార్టీ. ఇందుకోసం ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ సోనియా గాంధీ, సీతారం ఏచూరిలతో సమావేశమైన తీరే దీనికి నిదర్శనం. దేశ ప్రథమ పౌరుని ఎన్నిక ఏకాభిప్రాయంతో పూర్తవ్వాలనుకోవడం అభిలషణీయం అందులో ఎంతమాత్రమూ తప్పు లేదు. పోటీ ఏర్పడుతుంది కాబట్టే.. రెండోసారి రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండడానికి దివంగత అబ్దుల్ కలాం అంగీకరించలేదు. అదే క్షణం ఎవరికీ చెప్పాపెట్టకుండా రాష్ట్రపతి భవన్‌ను వీడారు. ప్రస్తుత రాష్ట్రపతి అంశంలో అలాంటి వివాదమేదీ లేదు. ప్రణబ్‌కు రెండోసారి చాన్సివ్వబోమని బీజేపీ కుండబద్దలు కొట్టేసింది. కానీ, ఏకాభిప్రాయంతోనే ఎన్నిక పూర్తికావాలని కోరుకుంటోంది. నిజంగా అలాంటి అభిలాషుంటే ఏం చేయాలి? తమ అభ్యర్థి ఫలానా అని ముందు నిర్ణయించుకోవాలి. ఆపై ప్రతిపక్షాల గడప తొక్కాలి. అదేమీ లేకుండా వెళ్ళి ఏకగ్రీవానికి సహకరించాలంటే ఒక్క ఎంపీయే ఉన్న పార్టీ కూడా అంగీకరించదు. 125ఏళ్ళు నిండిన కాంగ్రెస్ ఒప్పుకుంటుందా… నిలువెల్లా సమాన భావాన్ని నింపుకున్న సీపీఎం ఓకే అంటుందా. రెండు పార్టీలు కూడా అదే చెప్పాయి. అభ్యర్థి ఎవరో చెప్పకుండా చర్చలేమిటి అని ప్రశ్నించాయి. వాటి భయం వాటికుండదా. తీరా ఓకే అన్న తరవాత కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదిని ప్రథమ పౌరునిగా ప్రకటిస్తే….అదీ వాటి భయం. అందుకు సమాధానంగా పోనీ మీ అభ్యర్థి పేరు చెప్పండి… అంగీకారమైతే మద్దతిస్తామని బీజేపీ బృందం వారి ముందు సన్నాయి నొక్కులు నొక్కింది. ఈ అంశంలో ఉద్దవ్ ఠాక్రే ఒక మంచి పేరును తెరపైకి తెచ్చారు.. ఆయనే వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్. విజ్ఞులు.. రైతు సమస్యల పట్ల అవగాహన ఉన్న వారు ఆ స్థానాన్ని అలంకరిస్తే.. అన్నదాతకు కచ్చితంగా అగ్రతాంబూలమందుతుంది. ఠాక్రే కూడా తొలుత మోహన్ భగవత్ పేరును సూచించారు.
ఏదేమైనప్పటికీ, అత్యున్నతమైన పదవికి అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు అన్ని పార్టీలూ రాజకీయాలను పక్కకు పెట్టి వ్యవహరించాలి. జైల్ సింగ్‌ను రాష్ట్రపతి చేసినప్పుడూ కాంగ్రెస్ మొండిగా వ్యవహరించింది. ఆనక ఆయన రాజీవ్ గాంధీకి చుక్కలు చూపించారు. పంజాబ్ పరిణామాలు దీనికి కారణమని వేరే చెప్పనవసరం లేదు.
బీజేపీ ఇప్పటికే సుష్మా స్వరాజ్, అద్వానీ, ద్రౌపది ముర్ము, వంటి పేర్లను తెరపైకి తెచ్చింది. అందర్నీ కన్ఫ్యూజ్ చేసేసి, ఏర్పడిన వాతావరణాన్ని సొమ్ము చేసుకుందామనుకున్నట్లుగా బీజేపీ వైఖరి ఉంది. అందుకే చెరువులో గేదెను ఉంచి, దాని కొమ్ములు చూపించి బేరమాడినట్లు వ్యవహరించింది. అందుకే కాంగ్రెస్, సీపీఎంలు చక్కని జవాబిచ్చి పంపాయి. రేపటి సమావేశాలు ఇందుకు భిన్నంగా ఉండకపోవచ్చు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి