తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు ఊపిరి ఆడటం లేదు. నిజంగా తమకు అంత క్రేజ్ ఉందా.. అని వారిలో వారే ఆశ్చర్యపోతున్నారు. తమ కోసం.. టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయా.. అని వాళ్లకు వాళ్లు గిల్లి చూసుకుంటున్నారు. డీకే అరుణ బీజేపీలో చేరడానికి కారణాలేమో కానీ… కాంగ్రెస్‌లో ఉన్న ముఖ్యనేతల పేర్లన్నీ… కలిపేసి.. వారంతా బీజేపీలోకి వచ్చేస్తున్నారనే మైండ్ గేమ్ ప్రారంభించారు. విచిత్రంగా.. టీఆర్ఎస్ లో చేరేవారి గురించి తప్ప.. ఇతరుల గురించి ఏ మాత్రం చెప్పని… టీ న్యూస్ చానల్ .. బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు అని ఉదరగొట్టేస్తోంది.
ఎమ్మెల్యేలను.. టీఆర్ఎస్.. మాజీ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తోంది. రోజుకో నేత పార్టీని వీడుతుండటంతో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న భయం హస్తం పార్టీ నేతలకు పట్టుకుంది. నిజానికి తెలంగాణలో బీజేపీ జీరో. సొంత ఇమేజ్‌తో… గోషామహల్లో… రాజాసింగ్ గెలిచారు. 119 నియోజకవర్గాల్లో 105 చోట్ల డిపాజిట్లు రాలేదు. అలాంటి పార్టీలోకి.. ఎందుకు వెళ్తారు..? డీకే అరుణను చేర్చుకుని… బీజేపీ.. మైండ్ గేమ్ ప్రారంభించింది. దానికి టీఆర్ఎస్ అనుకూల మీడియా సహకరిస్తోంది. మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుండె విజయ రమణరావు, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, జనగామ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, నారాయణ పేటకు చెందిన కాంగ్రెస్ నేత శివకుమార్ రెడ్డి, షాద్ నగర్ నేత ప్రతాప్ రెడ్డి, బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్ లాంటి నేతలతో బీజేపీ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి ఎంపీలుగా పోటీ చేసేందుకు ఆఫర్లు ఇస్తుండంతో పాటు ఖర్చులు కూడా పార్టీనే భరిస్తుందని భరోసా ఇస్తున్నారట. ఆ కారణంగానే పలువురు అటు వైపు ఆసక్తి చూపుతున్నట్లు అంచనా వేస్తున్నారు నాయకులు.
కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి.. ఓడిపోయినా… ఇబ్బంది లేదని ఏదో ఓ పదవి ఇస్తారని చెబుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో.. డీలాపడ్డ కాంగ్రెస్ ను టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ను నైరాశ్యంలోకి నెడితే.. ఇప్పుడు అమిత్ షా.. మార్క్ తో తెరలేపిన ఆకర్ష్ పాలికిట్స్ తో దిక్కుతోచని పరిస్తితి నెలకొంది. దీంతో పార్టీలో ఉండే వారు ఎవరో.. తెల్లారే సరికి గోడ దూకే వారెవరో.. తేల్చుకోలేక కాంగ్రెస్ టెన్షన్ పడుతోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి పోగొట్టుకోవడానికి ఏమీ లేదన్నట్లుగా నిర్లిప్తంగా ఉంటోంది. అధికారంతో .. తమ పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తే ప్రజల్లోనే చర్చ జరుగుతుందని అంచనా వేస్తోంది. గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన నేతలందర్నీ బీదేపీలో చేర్చుకున్నారు. కానీ.. అక్కడ 60 అసెంబ్లీ సీట్లలో 57 ఆమ్ ఆద్మీ గెలుచుకుంది. అది ఫిరాయింపులపై ఆగ్రహం అన్న ప్రచారం జరిగింది. తెలంగాణలోనూ అదే జరుగుతుందని కాంగ్రెస్ ఆశిస్తోంది.