తెలంగాణలో దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ పూర్తికాగానే ప్రధాని మోడీ సభ ఉండనుందా…? అంటే తెలంగాణ బీజేపీ నేతల మాటలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తెలంగాణలో రుణమాఫీ చేసిన తర్వాత రాహుల్ గాంధీతో వరంగల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ మోడీ టూర్ పై ఫోకస్ చేసింది
రెండ్రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ వెళ్లి రుణమాఫీ గురించి చెప్పి… వరంగల్ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. నెలాఖరులో సభ ఉండే అవకాశం ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే, అప్పుడు పార్లమెంట్ ఉండే అవకాశం ఉండటంతో రాహుల్ ఓకే అంటారా లేదా అన్నది క్లారిటీ లేదు.
ఒకవేళ రాహుల్ గాంధీ వస్తే మాత్రం ఆ సభ అయ్యాక ప్రధాని మోడీతో హైదరాబాద్ లేదా కరీంనగర్ లో సభ పెట్టాలని బీజేపీ యోచిస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో చర్లపల్లి టెర్మినెల్ ఓపెనింగ్ ఉండనుంది. వర్చువల్ గా చేస్తారా… ప్రధాని మోడీ స్వయంగా వస్తారా… క్లారిటీ లేదు. కానీ, రాహుల్ వచ్చి వెళ్తే మాత్రం మోడీని రాష్ట్రానికి తీసుకరావాలని బీజేపీ నేతలు పట్టుదలగా ఉన్నట్లు సమాచారం.
తద్వారా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పటంతో పాటు తెలంగాణ అభివృద్దికి తాము నిధులు ఇస్తున్నామని చెప్పేందుకు చర్లపల్లి టెర్మినల్ అభివృద్దే సాక్ష్యమని చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ స్తబ్ధుగా ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ సభ అయిపోగానే మోడీ సభ ఉంటే బీజేపీకి ప్లస్ అవుతుందని, అవసరం అయితే బీఆర్ఎస్ నుండి మోడీ సభ సమయంలోనే చేరికలు ఉండేలా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.