రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ, తాము నిర్దేశించుకున్న లక్ష్యంలో 50 శాతం సభ్యత్వ నమోదు చేయగలిగామని మీడియాకి చెప్పారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తెరాస, మజ్లిస్ విధానాలతో విసిగిపోయిన ముస్లింలు కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాచరణను ప్రకటించారు లక్ష్మణ్. కేసీఆర్ హయాంలో అవినీతి పెరిగిపోయిందనీ, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను ఈనెల 30న నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్లా గట్టి పోటీ ఇవ్వడానికి అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నామన్నారు. కేసీఆర్ కి భాజపా అంటే భయం పట్టుకుందనీ, అందుకే మున్సిపల్ ఎన్నికల్ని కూడా వీలైనంత త్వరగా నిర్వహించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
పేదలకు ఇళ్లు ఇస్తామని కేసీఆర్ సర్కారు మోసం చేసిందనీ, దీనిపై న్యాయ పోరాటానికి వెళ్లాలని భాజపా ఆలోచిస్తోందన్నారు లక్ష్మణ్. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక న్యాయ విభాగాన్ని పార్టీ ఏర్పాటు చేయబోతందనీ, దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మీదా, సంక్షేమ పథకాల అమలు పేరుతో జరుగుతున్న దోపిడీ మీద పోరాటం చేస్తామన్నారు. ముందుగా, కేంద్రం అమలు చేస్తున్న పథకాలను కేసీఆర్ సర్కారు రాష్ట్రంలో ఎందుకు అడ్డుకుంటోందో అనే అంశంపై దృష్టిపెడతామన్నారు. ఇక, మున్సిపాలిటీల వారీగా సమస్యలను తెలుసుకునేందుకు కమిటీలను వేస్తున్నామనీ, ఈ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలపై ఈ నెల 26, 26 తేదీల్లో ధర్నాలు ఉంటాయన్నారు.
భాజపా ఫోకస్ మున్సిపల్ ఎన్నికలపై ఉందన్నది స్పష్టం. అందుకే, నగర ప్రాంతాల్లో సమస్యలపై అధ్యయనం అంటూ కమిటీలు వేస్తున్నారు. దీంతోపాటు, కేంద్ర పథకాల అమలుపై అవసరమైతే న్యాయ పోరాటం అంటున్నారు. రాష్ట్రంలో అవినీతిపైనా న్యాయపోరాటం అంటున్నారు. ఈ అంశాలను భాజపా సీరియస్ గానే తీసుకుని రంగంలోకి దిగుతున్నట్టుగా ఉంది. అయితే, ఇంతవరకూ తెరాస పాలనలో అవినీతి అని ఆరోపణలు చేసే ప్రతిపక్ష పార్టీ అంటూ తెలంగాణలో లేకుండా పోయింది. ఇప్పుడు భాజపా న్యాయ పోరాటం అంటోంది. మరి, ఆ పార్టీకి అవినీతి మీద దొరికిన ఆధారాలేంటో, ఆ పార్టీ చేయబోతున్న ఆరోపణలెలా ఉంటాయో చూడాలి. ఏదేమైనా, కేసీఆర్ సర్కారుని టార్గెట్ చేసుకోవడానికి భాజపా అన్ని వైపుల నుంచీ వ్యూహాలను మోహరిస్తోందన్నది స్పష్టంగా కనిపిస్తోంది.