సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు.. ఫలానా తేదీన రండి అని పిలిస్తే.. ఎవరైనా సరే రావాల్సిందే. రాను.. కూడదు.. కాదు అనే సమాధానం చెప్పాలన్న ఆలోచన కూడా మైండ్లోకి రాకూడదు. వస్తే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు. ఆ సార్ ఎవరంటే బీజేపీ. వాళ్లు పిలుస్తోంది ఎవరినంటే సినిమా వాళ్లను. ఎవరైనా సరే .. వచ్చి బీజేపీ సానుభూతిపరుడు అనే ముద్ర వేయించుకుని వెళ్లకపోతే.. వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో … చాలా మందిని చూసి ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చేశారు !
సినిమా స్టార్లంటే బీజేపీకి మక్కువ !
సినిమా వాళ్లంటే జనాలకు క్రేజ్. జనాల్లో క్రేజ్ తెచ్చుకున్న సినిమా వాళ్లంటే బీజేపీకి క్రేజ్. బీజేపీ ఎంత మంది సినిమా వాళ్లను రాజకీయాల్లోకి తెచ్చి నేతల్ని చేసిందో చెప్పడం కష్టం. విలన్ రవికిషన్ దగ్గర్నుంచి మలయాళ సురేష్ గోపీ వరకూ చాలా మంది ఉన్నారు. ఇక రాజకీయాల్లోకి రాకపోయిన అపొలిటికల్ అంటూ అక్షయ్ కుమార్ లాంటి వాళ్లు చేసే ఊడిగం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు వారి దృష్టి టాలీవుడ్‌పై పడింది. మొన్న ఎన్టీఆర్ నిన్న నితిన్ రేపో మాపో ప్రభాస్ ని కూడా పిలవచ్చు. ప్రభాస్ ఇప్పటికే ఓ సారి మోదీని కూడా కలిశారు.
ప్రభాస్ ఆదిపురుష్ బీజేపీ కోసమని ఇప్పటికే ఓ క్లారిటీ !
ప్రభాస్ సినిమా ఆదిపురుష్ ఎవరి కోసం తీస్తున్నారు ? బీజేపీ కోసమే తీస్తున్నారని ఇప్పటికే ఉత్తరాదిలో ప్రచారం జరుగుతోంది. వచ్చేఎన్నికల నాటికి అయోధ్య ఆలయాన్ని పునంప్రారంభిస్తారని ఆ తర్వాత ప్రభాస్ హీరోగా పెట్టి తీస్తున్న ఆదిపురుష్‌ను ధియేటర్లకో తెచ్చి… పూనకాలు తెప్పించి బీజేపీకి అనుకూలంగా ప్రజల్ని ఎమోషల్ బ్లాక్ మెయిలింగ్ చేయడానికేనని చెబుతున్నారు. గతంలో యూరీ అనే సినిమాను సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా తీయించి.. అందరికీ ఉచితంగా చూపించారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఇటీవల కశ్మీర్ ఫైల్స్ ను అలాగే హిట్ చేశారు. ఇక బీజేపీ పథకాలనుప్రమోట్ చేసేందుకు … అలాంటి కథలతో అక్షయ్ కుమార్ సినిమాలు తీస్తూనే ఉన్నారు. వచ్చే ఎన్నికలకు ఆ రోల్ ప్రభాస్‌దని చాలా మంది ఇప్పటికే క్లారిటీకి వచ్చేశారు.
ప్రచారం చేయకపోయినా పర్వాలేదు.. సానుభూతి పరులమని ముద్ర వేయించుకుంటే చాలు !
ఎన్నికల ప్రచారంలో సినీగ్లామర్ ఉండటం మాములే . ఒకప్పుడు సినీతారలకు ఆసక్తి ఉంటేనే ఎన్నికల ప్రచారానికి వచ్చేవారు. ఎవరూ బలవంతం చేసేవారు కాదు. కానీ ఇప్పుడు దేశంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్న వాదనలు ప్రతిరోజూ వినిపిస్తూనే ఉన్నాయి. మోదీ-షాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వారికి ఈడీ నోటీసులు, జైలు జీవితం లేదంటే రాజకీయజీవితమే లేకుండా చేస్తారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజకీయపార్టీలు, నేతలే కాదు వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులు సైతం మోదీ-షాల తీరుపై మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అందుకే పిలిస్తే పరుగులు పెట్టి వెళ్లి వస్తున్నారు.