దేశంలో భారతీయ జనతా పార్టీ ఎలా నిలదొక్కుకోగలిగింది అంటే… అద్వానీ చేసిన రథయాత్ర వల్ల అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయోధ్య రాముడి గుడి కేంద్రంగా జరిగిన రాజకీయంలో.. ఆయన రథయాత్ర చేసి దేశవ్యాప్తంగా బీజేపీకి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. ఇప్పుడు ఏపీ బీజేపీ కూడా అదే వ్యూహాన్ని ఏపీలో అమలు చేయాలని నిర్ణయించుకుంది. రామతీర్థంలో రాముడి విగ్రహానికి జరిగిన అవమానం సాక్షిగా.. రథయాత్ర చేయాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం రామరథయాత్ర అనే పేరు కూడా సిద్ధం చేశారు. రామతీర్థం నుంచే.. సంక్రాంతి అయిపోయిన తర్వాత పదిహేడో తేదీ నుంచి ప్రారంభిస్తారు.
రామరథయాత్రలో ప్రజాసమస్యలు ప్రధానాంశం కాదు. అసలు మాట్లాడరు. ఆలయాలు, విగ్రహాలపై దాడులు వంటి అంశాలపై మాత్రమే స్పందిస్తారు. ప్రతీ చోటకు… బీజేపీ జాతీయ నాయకులు వచ్చేలా చూస్తారు. ముఖ్యంగా హిందూత్వ ఇమేజ్ ఉన్న వారిని వారాంతాల్లో లేదా.. ప్రతీ రోజూ వచ్చి భాగస్వాములు అయ్యేలా లిస్ట్ రెడీ చేస్తున్నారు. ఈ యాత్ర… జిల్లాల్లో విగ్రహాలపై దాడులు జరిగిన ప్రాంతాల్లో జరుగుతుంది. యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్‌ను ఖరారు చేసేందుకు బీజేపీ కోర్ కమిటీ పదిహేడో తేదీన విశాఖలో సమావేశం కానుంది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. రథయాత్రలో ఒక్కడే కృష్ణుడు ఉండాలి. అప్పుడే హైలెట్ అవుతుంది. అప్పట్లో అద్వానీ అలా ఉండబట్టే సక్సెస్ అయింది. మరి ఇప్పుడు ఏపీకి ఆ కృష్ణుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న సోము వీర్రాజు ఉన్నారు. ఆయన ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆయన గత ట్రాక్ రికార్డ్ కారణంగా.. ఆయనను వైసీపీతో కలిపే చూస్తున్నారు. ఫలితంగా బీజేపీ అంతగా కలిసి రావడం లేదు. ప్రభుత్వాన్ని నిఖార్సుగా వ్యతిరేకించే ఇతర నేతలు ఎవరూ లైమ్ లైట్లో లేరు. పది మంది బీజేపీ నేతలుకలిసి యాత్ర చేయాల్సిందే. అలా చేస్తే ప్రజలు గుర్తించడం సంగతేమో కానీ… అసలు పట్టించుకోకపోయేప్రమాదం ఉందని అంటున్నారు. అయితే ఇలాంటి యాత్రల్ని హైలెట్ చేసుకోవడంలో బీజేపీ లెక్కే వేరుగా ఉంటుంది. ఢిల్లీలోనే రంగంలోకి దిగింది కాబట్టి.. ఏం జరిగినా ఆశ్చర్యం లేదన్న చర్చలు అన్ని చోట్లా నడుస్తున్నాయి.