పాకిస్తాన్తో యుద్దం వస్తుందని.. భారతీయ జనతా పార్టీ నేతలు తనకు రెండేళ్ల కిందటే చెప్పాలని.. పవన్ కల్యామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆయన దేశభక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉన్నట్లు ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. యుద్ధం రాబోతోందని… తనకు రెండేళ్ల కిందటే చెప్పాలని.. దీన్ని బట్టి ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏ సందర్భంలో.. ఏ బీజేపీ నేత.. తనకు ఇలా చెప్పారో పవన్ కల్యాణ్ డీటైల్డ్ గా వివరించలేదు కానీ.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మాత్రం కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే.. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలవడానికి యుద్ధవ్యూహం అమలు చేస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ అలాంటి ప్రకటనే చేశారు.
బీజేపీ తనకు ఇలా చెప్పిందని.. ఇప్పుడే కాదు.. గతంలోనూ కొన్ని సందర్భాల్లో పవన్ కల్యాణ్ చెప్పారు. కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ కు ముందే.. ఉత్తరాంధ్ర పోరాటయాత్ర చేస్తున్న సమయంలోనే.. ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని… తనకు బీజేపీ పెద్దలు చెప్పారని ప్రకటించుకున్నారు. వారి ప్లాన్లు వారికున్నాయన్నారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వమే అక్కడ మొదటగా అధికారం చేపట్టినప్పటికీ.. నిలబడలేకపోయింది. నిజానికి అప్పట్లో పవన్ కల్యాణ్ కు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉండేవన్న ప్రచారం ఉంది. మొదట్లో బీజేపీ, మోడీపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత.. మెతక ధోరణికి మారారు. టీడీపీతో సన్నిహిత సంబంధాలను వదిలించుకుని ఆ పార్టీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. రామ్ మాధవ్ లాంటి వారి సూచనల మేరకు పవన్ కల్యాణ్ నడుస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది.
ఏ విధంగా చూసినా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు కాస్త సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఇలాంటి వ్యూహం బీజేపీ పెద్దలకు ఉండి.. తమతో కలవాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ గెలుస్తామన్న నమ్మకాన్ని పవన్ కల్యాణ్ కు కల్పించడానికి ఇలా చెప్పి ఉంటారన్న అంచనాలు ఉన్నాయి. ఈ విషయంలో పవన్ కల్యాణ్ మరిన్ని విషయాలు బయటపెట్టాల్సి ఉంది. లేకపోతే శివాజీ ప్రకటించిన ఆపరేషన్ గరుడలా.. పవన్ కల్యాణ్ ఆరోపణలు కూడా మిగిలిపోయే ప్రమాదం ఉంది.