నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదన్న పొలిటికల్ మైండ్ సెట్‌తో ఏపీ బీజేపీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ పార్టీ నిర్ణయాలను ఆ పార్టీ ప్రకటిస్తోంది. ” జనసేన పార్టీ మాతోనే ఉంటుంది.. ఉండాలి ” ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కమాండింగ్ ప్రకటనలు చేస్తున్నారు. ఒక్క చాన్స్ అనే జనసేన అధినతే పవన్ నినాదానికి మద్దతిస్తామంటున్నారు. ఆ ఒక్క చాన్స్ పవన్ కు అయితే.. సీఎం అభ్యర్థిగా గతంలో ప్రకటించడమంటే ఎందుకు అవమానించారో ఆయన చెప్పాల్సి ఉంది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని కానీ.. వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని కానీ జనసేన చెప్పడం లేదు. ప్రభుత్వంపై అందరూ కలిసి పోరాడాలని అటు టీడీపీ..ఇటు జనసేన రెండూ చెబుతున్నాయి. కానీ ఎన్నికల్లో కలిసి పోటీ గురించి మాత్రం చెప్పడం లేదు. కానీ బీజేపీ మాత్రం ప్రభుత్వంపై పోరాటం గురించి చెప్పడం లేదు…కానీ జనసేన మాత్రం తమతోనే ఉంటుందని అదే పనిగా ప్రకటిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఏపీలో కనీస బలం లేదు. ఇప్పటికిప్పుడు ఓటింగ్ పెట్టినా ఒక శాతం ఓట్లు రావు.ఎందుకంటే.. సోషల్ మీడియాలో ఆ పార్టీని సమర్థించే వాళ్లు కూడా వైసీపీకే ఓట్లేస్తారు. ఎందుకంటే వారి రాజకీయం చంద్రబాబు వ్యతిరేకత మాత్రమే. బీజేపీ అనుకూలం కాదు.
ఏ ఏన్నికలైనా అధికార పార్టీని కొనసాగించాలా వద్దా అనే ప్రాతిపదికన సాగుతాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి మరో చాన్స్ ఇవ్వాలా ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా అన్న దిశగా ప్రజలు తీర్పు చెబుతారు. ఈల క్రమంలో బీజేపీ తన వ్యూహాన్ని వైసీపీకి అనుకూలంగా మార్చుకుంటోంది. జనసేన పార్టీని కూడా ఇతర పార్టీలతో కలవకుండా చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఒక్క చాన్స్ నినాదానికి తాము మద్దతిస్తామని అంటున్నారు.అంటే ఎలాగైనా పవన్ ఇతర పార్టీలతో కలవకుండా చేయాలనుకుంటున్నారు. ఓట్లు చీల్చేలా చేయాలనుకుంటున్నారు.