తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ పోలీస్ స్టేషన్లకూ చేరాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం, ఢిల్లీలో మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో నలుగురిని కిడ్నాప్ చేసిన వ్యవహారంలో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే హత్యాయత్నం కేసు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారగా.. తాజాగా తెలంగాణ పోలీసులపై ఢిల్లీలో కేసు నమోదైంది. స్థానిక పోలీసుల అనుమతి లేకుండా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలోకి వెళ్లినందుకు కేసు నమోదైంది.
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పీఏ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జితేందర్ రెడ్డి పీఏకు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేసు విచారణ కోసం హైదరాబాద్ రావాలని కోరారు. బీజేపీ ముఖ్య నేతలయిన జితేందర్ రెడ్డి, డీకే అరుణలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్న బీజేపీ అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ లాంటి సంస్థలను దింపలేరు కాబట్టి ఢిల్లీ పోలీసుల్ని ఉపయోగించుకుంటున్నారు.
తమ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ కూడా సీరియస్గా తీసుకున్నట్లుగా కనిపిస్తోందని భావిస్తున్నారు. అందుకే ఢిల్లీ పోలీసులు.. తెలంగాణ పోలీసులపై కేసు నమోదు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటారు. ఈ క్రమంలో ఈ కేసులో ముందు మందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.