రాజకీయంగా సున్నితమైన కేసులన్నింటినీ సీబీఐకే ఇవ్వాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాళేశ్వరం విషయంలో ఇప్పటికే ఇలాంటి డిమాండ్లు చాలా సార్లు చేసింది. అయితే బీఆర్ఎస్ జుట్టు తమకు అందిందని.. అది బీజేపీ చేతికి ఎందుకు ఇస్తామని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ బీఆర్ఎస్ పెద్దలు నిండా మునిగిపోయారన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్కు కూడా విజ్ఞప్తి చేశారు.
అయితే రాష్ట్ర పరిధిలోని అంశాలపై విచారణకు ఆదేశించే అధికారం గవర్నర్కు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కావాలని సిఫారసు చేస్తే చేయవచ్చు. లేదా కోర్టు ఆదేశిస్తే సీబీఐ విచారణ జరిగే అవకాశం ఉంటుంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కావాలని బీజేపీ సానుభూతిపరుడు కోర్టుకు వెళ్తే అనుకూల ఫలితం రాలేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని గవర్నర్ ద్వారా ప్రయత్నిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం కూడా తెరపైకి వచ్చింది. బీఎల్ సంతోష్ ఫోన్ ని కూడా ట్యాప్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ .. ఈ కేసు తమ చేతికి వస్తేనే మంచిదని భావిస్తోంది. అందుకే గవర్నర్ ద్వారా ప్రయత్నిస్తోంది. రేపు బీజేపీ సానుభూతిపరులు కోర్టుకు వెళ్లినా ఆశ్చర్యం లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.