సభ్యులలో అత్యధిక అనుభవం కలిగిన ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్ గా నియమించాలనేది ఒక సంప్రదాయం. దాన్ని కూడా భాజపా తూట్లు పొడిచేసింది. తమకు అనుకూలమైన వ్యక్తి బోపయ్యను నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై కూడా మరోసారి సుప్రీం కోర్టు తలుపులు తట్టింది కాంగ్రెస్ పార్టీ. అభిషేక్ మనుసింగ్, కపిల్ సిబల్ లతో కూడిన న్యాయవాదుల బృందం రాత్రి 8 గంటల ప్రాంతంలో సుప్రీం కోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ కు ఫిర్యాదు అందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే, ఇంతకీ ఈ బొప్పయ్య కూడా భాజపాకి నమ్మిన బంటే. వివాద రహితుడు అంతకన్నా కాదు! ఇంకా చెప్పాలంటే.. ఎడ్యూరప్పకు, కుడి భుజం లాంటివారనీ, పీయే మాదిరిగా వ్యవహరించే వ్యక్తి అని కూడా చెబుతున్నారు! గతంలో, ఎడ్యూరప్ప ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు.. ఈయనే కాపాడారు. ఎలాగంటే, అప్పట్లో కూడా ఇలాగే ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తూ… ఫ్లోర్ టెస్ట్ కి ముందు 15 మంది భాజపా రెబెల్ ఎమ్మెల్యేలను డిస్మిస్ చేశారు. ఐదుగురు ఇండిపెండెంట్లను కూడా డిస్మిస్ చేశారు. కేవలం ఎడ్యూరప్పకు ఓటేస్తారన్న ఒకే ఒక్క కారణంతో ఆయన ఇలా చేశారు. కానీ, తరువాత ఈ వ్యవహారం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఆయనకి చీవాట్లు పెట్టింది. స్పీకర్ గా ఎలా వ్యవహరించాలో నేర్చుకో అంటూ చెప్పింది. అంతేకాదు, ఆయన తొలగించిన 20 మందినీ మళ్లీ వెనక్కి తీసుకొచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.
అలాంటి అనుభవం ఉన్న బోపయ్యను మరోసారి ఏరి కోరి గవర్నర్ ఎందుకు నియమించారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, గతంలో మాదిరిగా ఈయన ఇప్పుడు కూడా ఇలాంటి ట్రిక్స్ ఏవైనా ప్లే చేస్తారేమో చూడాలి. పైగా, స్పీకర్ తీసుకునే నిర్ణయాలపై కోర్టుల జోక్యం అనేది కూడా కొంత చిక్కైన వ్యవహారమే! శాసన వ్యవస్థ వ్యవహారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యంపై కొన్ని అడ్డంకులూ ఉన్నాయి. మరి, వీటిని కూడా తమకు అనుకూలంగా వాడుకునేందుకు భాజపా ఏమైనా ప్రయత్నిస్తుందేమో చూడాలి. ఏదేమైనా, భాజపా అధికార దాహాం తీవ్రత ఏ స్థాయి చేరుకుందేనేది దేశ ప్రజలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారనేది వాస్తవం..! మోడీ షా ద్వయం అధికార గర్వానికి ఇది పీక్స్ అనడంలో సందేహం లేదు.