బీజేపీలో నెంబర్ త్రీ అయిన బీఎల్ సంతోష్‌ను సిట్ టార్గెట్ చేసింది. ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఓ దశలో అరెస్ట్ చేసి తీసుకు వస్తారన్న ప్రచారమూ జరిగింది. ఆ తర్వాత ఈ కేసులో అమిత్ షాకూ నోటీసులిస్తారని చెప్పుకున్నారు. ఏదీ జరగలేదు. కానీ.. బీఎల్ సంతోష్ మాత్రం హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
హైదరాబాద్ లో ఈ నెల 28,29 తేదీలలో రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాల పూర్తి స్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్ వస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని 60 లోక్ సభ నియోజక వర్గాలకు చెందిన కార్యకర్తలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతం, ప్రచారశైలిపై కార్యకర్తలకు నేతలు శిక్షణ ఇవ్వనున్నారు.
బీఎల్ సంతోష్‌కు సిట్ పోలీసులు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేకపోయారు. బీఎల్ సంతోష్ న్యాయస్థానాలకు వెళ్లి నోటీసులపై స్టే తెచ్చుకున్నారు. ఈ కేసుల్లో ఇంకా విచారణలు జరుగుతున్నాయి. అసలు సిట్ విచారణ చేయడం కుదరదంటూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్రుపై సిట్ హైకోర్టుకెళ్లింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఏసీబీ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థిస్తే సిట్ ఇక పని చేయనట్లే.
ముందస్తుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని క్లారిటీ రావడంతో అలర్ట్ అయిన బీజేపీ కీలక నేతలు తెలంగాణ పై మరింత ఫోకస్ ను పెంచారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీఎస్ సంతోష్ తో పాటు అమిత్ షా పేరు కూడా వినిపించింది. అమిత్ షాకూ నోటీసులిస్తారన్న ప్రచారం జరగుతోంది .ఈ క్రమంలో వారి హైదరాబాద్ కు వీరి రాక ఆసక్తి రేపుతోంది. అయితే అప్పట్లోపు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.