మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో ఏమైనా అక్రమాలు దొరుకుతాయేమో అని ఏపీ అధికారులు చాలా ప్రయత్నాలు చేశారు కానీ..ఏమి దొరికాయో మాత్రం చెప్పడం లేదు. కానీ అడిగిన వివరాలివ్వడం లేదని.. ఆ సంస్థ ఆర్థిక పరిస్థితిపై అనుమానంగా ఉందని.. అధికారులు.. రాజకీయ నాయకుల్లా మీడియా సమావేశాలు పెడుతున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ ప్రెస్ మీట్ పెట్టి … మార్గదర్శిపై ఆధారాలు లేని ఆరోపణలు చాలా చేశారు.
2018లో కూడా మార్గదర్శి బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వలేదని ఐజీ చెప్పారు. ఆ రోజే సెకండ్ అకౌంట్ వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. కానీ ఈ రోజుకి కూడా మార్గదర్శి సెకండ్ అకౌండ్ వివరాలు ఇవ్వలేదన్నారు. వివరాలు అడిగినా ఇవ్వకపోవడంతో మార్గదర్శిలో డబ్బుకి భద్రత ఉందా లేదా అనే సందేహం ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత స్టాట్యూటరీ డాక్యుమెంట్లు ఫైల్ చేయలేదన్నారు. ప్రతి చిట్ వివరాలు ఇస్తేనే వాస్తవం తెలుస్తుందని..కానీ పూర్తి వివరాలు ఇవ్వడం లేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రామకృష్ణ తెలిపారు.
మార్గదర్శి చిట్ ఫండ్ కు చెందిన నగదును.. ఉషోదయ, ఉషాకిరణ్ సంస్థల్లో పెట్టారని ఐజీ చెప్పుకొచ్చారు. సమాచారం కోసం అడిగితే సహకరించడం లేదు సహకరించకపోగా మేం దుర్భాషలాడామని ఆరోపిస్తున్నారని విమర్శించారు. చాలా రకాలుగా అక్రమాలు పాల్పడినందున చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇవన్నీ ఐజీ రామకృష్ణ మీడియాకు ఎందుకు చెబుతున్నారో కానీ.. చట్ట ప్రకారం అయితే ఆయన లోపాలు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేమీ లేకుండా… రాజకీయ నాయకుల్లా.. మార్గదర్శి ఆర్థిక స్థితిపై వివాదాస్పద కామెంట్లు చేయడం… ఓ సంస్థపై కుట్ర చేయడమేనన్న అనుమానాలు సహజంగానే వస్తాయి.
మార్గదర్శి మీద ఎవరైనా కస్టమర్ ఫిర్యాదు చేస్తే కనీసం స్పందించినా అర్థం ఉండదు. ఇంత వరకూ ఒక్క కస్టమర్ ఫిర్యాదు చేయని సంస్థపై ఇంతలా ఎందుకు దాడులకు తెగబడుతున్నారో ఎవరికీ తెలియకుండా ఉంటుందా ?