మహేశ్ భట్ కథతో విక్రమ్ భట్ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే సహజంగానే ఎంతో కొంత ఆసక్తి ఏర్పడుతుంది. ఎందుకంటే వారి ట్రాక్ రికార్డ్ లాంటిది. అవికా గోర్ ప్రధాన పాత్రలో డిస్నీ హాట్ స్టార్ లో తాజాగా వచ్చిన ‘బ్లడీ ఇష్క్’ సినిమాపై ద్రుష్టి పడటానికి కారణం కూడా ఇదే. ఇంతకుముందు అవికాతో ‘1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్’ సినిమా తీసింది భట్ అండ్ కో. ఆ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చింది. మరి రెండో ప్రయత్నంగా వచ్చిన బ్లడీ ఇష్క్ అవికా కొరుకునే విజయాన్ని ఇచ్చిందా? ఈ హారర్ డ్రామాలో భయపెట్టే ఎలిమెంట్స్ ఏమిటి ?
స్కాట్ లాండ్ లోని ఓ ఐలాండ్. అక్కడ ఓ మహల్ లాంటి ఇల్లు. ఆ ఇంట్లో రోమేశ్ (వర్ధన్ పూరి) తన భార్య నేహా (అవికా గోర్) కలిసి ఏకాంతంగా జీవిస్తుంటాడు. ఆ మహల్ ఏవో కొన్ని అదృశ్య శక్తులు నేహకి కనిపిస్తుంటాయి. రాత్రి వేళ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తుంటాయి. ఇదే విషయాన్ని తన భర్తకు చెప్తే అదంతా ఏం లేదని కొట్టిపారేస్తాడు. మరి దీనివెనుక వున్నది ఎవరు? ఈ కథలో రోమేశ్ తండ్రి (రాహుల్ దేవ్), ఆయనకు కాబోయే రెండో భార్య (జెన్నీఫర్ పిచినటో) పాత్రల ప్రమేయం ఏమిటి? నేహ ఊహించినట్లే ఆ మహల్ లో అదృశ్య శక్తులు ఉన్నాయా? ఇవన్నీ తెరపై చూడాలి.
మహేశ్, విక్రమ్ భట్ సినిమాల్లో దాదాపు కథలు ప్రేమ, మొహం, కామం, వాంఛ, క్రోధం ఇలాంటి ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంటాయి. ముఖ్యంగా వాళ్ళు తీసిన హారర్ సినిమాల్లో ఇలాంటి ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి గతంలో మ్యాజిక్ చేశారు. కానీ ఇప్పుడా మ్యాజిక్ కుదరడం లేదు. దీనికి తాజా నిదర్శనంగా నిలిచింది ‘బ్లడీ ఇష్క్’.
ఓ ప్రమాదం కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోయిన నేహ పాత్రని పరిచయం చేస్తూ కథమొదలౌతుంది. తర్వాత కథ ఎంతకీ ముందుకు కదలదు. మహల్ లోకి షిఫ్ట్ అయిన తర్వాత ఇక ఒకే ఇంట్లో కథ బంధీ అయిపోతుంది. ఇక అక్కడ నుంచి వచ్చే సన్నివేశాలు ఎలాంటి ఎమోషన్ ని క్రియేట్ చేయవు. హారర్ ఎలిమెంట్స్ చాలా పేలవంగా వుంటాయి. దెయ్యాన్ని చూపించే విధానం భయం పుట్టించకపోగా నవ్వుతెప్పించేలా వుంటుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ అయితే మరీ గందరగోళం. ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ అని చెప్పడానికి ఏమీ లేదు. ఏ దశలోనూ ఆసక్తి కలిగించిన కథ ఇది. రోమేశ్ తండ్రి, ఆయనకు కాబోయే రెండో భార్య ట్రాక్, ప్రేమ, కామం అంటూ చివర్లో ఏవేవో సన్నివేశాలు వచ్చిపడతాయి. ఒక ఇల్లీగల్ ఎఫైర్ కి హారర్ కోటింగ్ ఇచ్చే వైనం ఎంతమాత్రం కుదరక…ఆ ప్రహసనం అంతా ప్రేక్షకుడికి విసుగుతెప్పించేలా వుంటుంది.
ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉందా అంటే అది అవికా గోర్. చాలా సిన్సియర్ గా నటించింది. తన పరిధిదాటి బోల్డ్ సీన్స్ కూడా చేసింది. కానీ కథ, మేకింగ్ లో బలం లేక అవన్నీ తేలిపోయాయి. వర్ధన్ పూరి యాక్టింగ్ పర్వాలేదనిపిస్తుంది. హీరో తండ్రిగా రాహుల్ దేవ్ ది గెస్ట్ పాత్ర. ఆయన గురించి చెప్పడానికి ఏమీ లేదు. జెన్నీఫర్ గతంలో విక్రమ్ భట్ సినిమాల్లో బిపాసాబసుని గుర్తుకు తెస్తుంది.
టెక్నికల్ గా ఈ సినిమా ఎంత పేలవంగా వుందో ప్రత్యేకంగా చెప్పాలి. సినిమా అంతా గ్రీన్ మ్యాట్ లో తీశారు. అంతా ఒక అట్ట సెట్టింగ్ లా వుంటుంది. కథ కథనాలు మాట పక్కన పెడితే ఒక్క సీన్ కూడా నేచురల్ గా తీయలేదు. మొత్తం స్టూడియోలో చుట్టేశారు అని సలువుగా అర్ధమౌతుంటుంది. పాటలు కుదరలేదు. నేపధ్యం సంగీతంలో కొంతలో కొంత బెటరు. నిజానికి ఈ సినిమాని నేరుగా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అవుట్ పుట్ చూసి వెనక్కి తగ్గినట్లు వున్నారు. అయితే ఓటీటీ ఆడియన్స్ ని కూడా తీవ్రంగా నిరాశపరిచే సినిమా ఇది.