వచ్చే ఎన్నికల్లో వ్యూహాలు రచించేందుకు ప్రశాంత్ కిషోర్ ను వైకాపా నియమించుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా ఆయనకి పేరుంది. ప్రతిపక్ష నేత జగన్ తో కలసి ఆయన తాజాగా ఒక సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో పదమూడు జిల్లాల వైకాపా అధ్యక్షులతో పాటు ఇతర నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతల్ని ప్రశాంత్ కు జగన్ పరిచయం చేశారు. రెండేళ్లలో రాబోతున్న శాసన సభ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలపై ప్రముఖంగా ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. దీంతోపాటు ప్రస్తుతం వైకాపా పరిస్థితిని కూడా విశ్లేషించినట్టు కూడా చెబుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నితీష్ కుమార్ లపై అభిమానంతోనే వారితో పనిచేశానని పీకే చెప్పారు. జగన్ అంటే తనకు ఇష్టమనీ, అందుకే కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డానని ఆయన అన్నారు. పార్టీ నేతలు పనితీరును మెరుగుపరచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. పార్టీ టిక్కెట్ల కేటాయింపులు వంటి వ్యవహారాలు తనకు సంబంధం లేనివనీ, పార్టీని ప్రజలకు చేరువ చేయడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీకి అవసరమైన వ్యూహాలను రచించడమే తన బాధ్యత అన్నారు. పీకే చెప్పిన మరో కీలకమైన విషయం ఏంటంటే.. వైసీపీకి సంబంధించి తాను ఇంతవరకూ ఎలాంటి సర్వేలూ చేయించలేదని స్పష్టం చేయడం! తన పేరిట కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న సర్వేల సమాచారాన్ని తప్పుబట్టారు. వాటిని ఖండిస్తున్నా అని చెప్పారు.
ఈ మధ్య కొన్ని మీడియా సంస్థలు ప్రశాంత్ కిషోర్ సర్వేలంటూ తరచూ కథనాలు రాసేస్తూ ఊదరగొట్టాయి. అవన్నీ బోగస్ అన్నమాట! ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వైకాపా గెలిచేస్తుందనీ, జగన్ నేతృత్వంలో ఒక మహా కూటమి ఏర్పాటు చేయాలనీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు కోసం జగన్ ఆలోచిస్తే మేలనీ.. ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రశాంత్ కిషోర్ చేయిస్తున్న సర్వేల్లో బయటపడుతున్నాయంటూ ఈ మధ్య కొన్ని మీడియా సంస్థలు తరచూ కథనాలు వండి వార్చేస్తూ వచ్చాయి! అందరూ కాకపోయినా.. కొంతమందైనా ఈ కథనాలు నిజం అనుకుని నమ్మి ఉంటారు కదా! అయితే, తాను ఎలాంటి సర్వేలూ చేయించలేని పీకీ ఇప్పుడు చెప్పడంతో… సదరు సంస్థ విశ్వసనీయత ఏపాటిదో ప్రజలకు ఇట్టే అర్థమౌతుంది. వైకాపాకి కొమ్ము కాస్తున్న మీడియా ఏంటో ప్రజలకు తెలుసు. అయితే, పార్టీకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి కట్టుకథలు ప్రచారంలోకి తెస్తే.. ఇదిగో ఇలానే బక్కబోర్లా పడాల్సి వస్తుంది. పార్టీకి ఏదో ఫేవర్ చేసేస్తున్నాం అని నిరూపించుకునే క్రమంలో వాస్తవాలను వక్రీకరిస్తే చివరి ఇలానే జరుగుతుంది.