పాన్ ఇండియా పుణ్యం… కొంతమంది వెటరన్ బాలీవుడ్ స్టార్లు కూడా ఇప్పుడు మళ్లీ ఫేమ్ లోకి వచ్చేశారు. వీళ్ల పనైపోయిందనుకొన్న మాజీ హీరోలు ఇప్పుడు విలన్ పాత్రలతో మళ్లీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అలాంటి వాళ్లలో సంజయ్ దత్ ఒకడు. కొత్త హీరోల మోజులో పడి బాలీవుడ్ ఎప్పుడో సంజూ భాయ్‌ని మర్చిపోయింది. అయితే దక్షిణాది మాత్రం విలన్ పాత్రలిచ్చి ఆదరిస్తోంది. ‘కేజీఎఫ్’, ‘లియో’ చిత్రాల్లో సంజూ విలన్‌గా మెరిశాడు. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్‌లో’నూ తనే ప్రతినాయకుడు. ప్రభాస్ ‘రాజా సాబ్’లోనూ ప్రభాస్‌తో తానే ఢీ కొట్టబోతున్నాడు.
Also Read : సంజయ్దత్లా మారిపోయిన రామ్
దక్షిణాది నుంచి ఆఫర్ రాగానే, బాలీవుడ్ స్టార్ల కళ్లు నెత్తిన ఎక్కుతాయేమో..? పారితోషికాలు, అదనపు సౌకర్యాలూ అంటూ గొంతెమ్మ కోర్కెలన్నీ కోరతారు. వాటికి మనవాళ్లు ఓకే చెబుతారు కూడా. కానీ తీసుకొన్నదంతా తీసుకొని, ప్రమోషన్ వరకూ వచ్చేసరికి మొహం చాటేస్తుంటారు. సంజూ భాయ్దీ అదే పరిస్థితి. ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం సంజూకి భారీగానే పారితోషికం ముట్టజెప్పారు. ప్రమోషన్ల కోసం హైదరాబాద్ రావాలని, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వాలని ముందే ప్రపోజల్ పెట్టారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ రావడానికి సంజూ ఇబ్బంది పెడుతున్నాడని, ఇంటర్వ్యూలు ఇవ్వనంటున్నాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. సంజూ మీడియా ముందుకొస్తే, సినిమా గురించి మాట్లాడితే సినిమాకు ఎంతో కొంత ప్లస్ అవుతుంది. అసలు బడా స్టార్లని సినిమాల్లో తీసుకోవడానికి ప్రధాన కారణం అదే. అయితే సంజూ లాంటి వాళ్లు ఇప్పుడు ప్రమోషన్లకు డుమ్మా కొట్టడంతో ఆ సౌలభ్యం కూడా పోతుంది. సంజయ్ దత్ హైదరాబాద్ రాడని, సంజూ కోసమే ముంబైలో ఓ ఈవెంట్ ప్లాన్ చేసింది ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్. ఈరోజు ముంబైలో ఓ పాటని విడుదల చేశారు. ఆ ఈవెంట్ ఏదో హైదరాబాద్ లో నిర్వహించుకొంటే కొంత మైలేజ్ వచ్చేది. మీడియా ఎటెన్షన్ ఉండేది. రాబోయే ‘రాజా సాబ్’ విషయంలోనూ సంజూ ఇలానే ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. సంజూ ఒక్కడితోనే ఈ సమస్య కాదు. సౌత్ లోని పెద్ద పెద్ద స్టార్లంతా, తెలుగు సినిమాల్లో నటిస్తూ, భారీ పారితోషికం అందుకొంటూ ప్రమోషన్ల దగ్గరకు వచ్చేసరికి మొహం చాటేస్తున్నారు. ‘పుష్ష’ ఫేమ్ ఫహద్ ఫాజిల్ కూడా ప్రమోషన్ల దగ్గర ఇలానే పేచీ పెట్టేరకం. మోహన్‌లాల్ ని ఓ సినిమాకి ఒప్పించడం తేలికే. కానీ ప్రమోషన్లకు తీసుకురాడం కష్టం. ఇలా చెప్పుకొంటూ పోతే చాలామంది స్టార్లే కనిపిస్తారు. కోట్లు ఇచ్చినా ప్రమోషన్లకు రాకపోతే.. అలాంటి వాళ్లని బతిమాలి మరీ, సినిమాల్లో తీసుకోవడం ఎందుకన్నదే ఎవరికీ అర్థం కాని ప్రశ్న.