ఒకప్పుడు బాలీవుడ్ సినిమాకీ, దక్షిణాది చిత్రాలకూ స్పష్టమైన తేడా ఉండేది. మనవన్నీ ‘సాంబార్ సినిమాలు’ అని బాలీవుడ్ వాళ్లు కొట్టి పడేసేవారు. దక్షిణాది చిత్రాలకూ, ఇక్కడి మార్కెట్ కూ పెద్ద విలువ ఇచ్చేవారు కాదు. ఇండియన్ సినిమా అంటే, బాలీవుడ్ సినిమానే అని ప్రోపకాండ చేసేవారు. అయితే రోజులు మారాయి. బళ్లు ఓడలు, ఓడలు బళ్లూ అయ్యాయి. బాలీవుడ్ వైభవం మసకబారిపోయింది. అదే సమయంలో సౌత్ సినిమా సత్తా చాటింది. తెలుగు నుంచి బాహుబలి, ఆర్.ఆర్.ఆర్, పుష్ష లాంటి చిత్రాలు వచ్చాయి. కన్నడ సీమ కేజీఎఫ్, కాంతారలను దింపింది. మలయాళం ఎప్పటిలానే కంటెంట్ ని నమ్ముకొని సినిమాలు తీసింది, అద్భుతాలు సృష్టించింది. ఈ గ్యాప్ లో బాలీవుడ్ మొత్తం చిత్తయిపోయింది. అక్కడ బడా స్టార్లు కూడా కుదేలైపోయారు. దక్షిణాది గొప్పదనం ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు. ఇండియన్ సినిమా అంతే. బాలీవుడ్ స్టార్లు దక్షిణాది సినిమాల్లో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
అయితే ఇప్పుడు మళ్లీ కొంతమంది పనిగట్టుకొని బాలీవుడ్ – టాలీవుడ్ అంటూ వేరు చేసి మాట్లాడుతున్నారు. దక్షిణాది సినిమాల్ని, ఇక్కడి హీరోల్ని కించ పరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. అర్షద్ వార్సీ ప్రభాస్ పై చేసిన కామెంట్లు బాలీవుడ్ కి సౌత్ ఇండియా అంటే ఎంత చిన్న చూపు ఉందో చెప్పకనే చెప్పాయి. ప్రభాస్ ని ఆయన జోకర్‌తో పోల్చాడు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం రేపాయి. తెలుగు చిత్రసీమ నుంచి కొంతమంది అర్షద్‌కు కౌంటర్లు ఇచ్చారు.
‘యానిమల్ ‘ సూపర్ డూపర్ హిట్టవ్వడం బాలీవుడ్ లో కొంతమందికి నచ్చలేదు. దానికి కారణం.. ఆ సినిమాకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కావడం. ఓ తెలుగు దర్శకుడు తీసిన సినిమా అది. అందుకే ఏదో రూపంలో ఆ సినిమాని విమర్శిస్తూనే ఉన్నారు. సందీప్ ఏం ఆగలేదు. తన స్టైల్ లో వాళ్లపై రివర్స్ ఎటాక్ చేసి నోళ్లు మూయించాడు. ‘జవాన్’ చూసి కూడా అక్కడి జనాలు నోరెళ్లబెట్టారు. ‘ఇంత రొటీన్ సినిమాకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయ్’ అంటూ విస్తుబోయారు. ఇదంతా దక్షిణాది ఎదుగుదల చూడలేకే.
Also Read : చిరు Vs బాలయ్య… ఎవరిది పై చేయి?
ఇవి చాలదన్నట్టు ‘కాంతార’తో జాతీయ అవార్డు అందుకొన్న రిషబ్ శెట్టి ఇటీవల బాలీవుడ్ పై ఘాటైన విమర్శలు చేశాడు. కొన్ని బాలీవుడ్ చిత్రాలు మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు. ఇది బాలీవుడ్ వాళ్లకు నచ్చలేదు. ‘జాతీయ అవార్డు వచ్చిందని ఏది పడితే అది మాట్లాడకు’ అంటూ అక్కడి వాళ్లు ఫైర్ అవుతున్నారు. రిషబ్ పాత సినిమాల్ని, అందులోని క్లిప్పింగ్స్‌నీ ఏరి రిషబ్ ని ట్రోల్ చేస్తున్నారు. ‘కాంతార’ జాతీయ అవార్డు వచ్చేంత గొప్ప సినిమా కాదని, అందులో రిషబ్ నటన కూడా ఆ స్థాయిలో ఉండదంటూ హేళనగా మాట్లాడుతున్నారు.
ఇవన్నీ బాలీవుడ్ – దక్షిణాది మధ్య చిచ్చు పెట్టే అంశాలే. అమితాబ్చన్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ లాంటి దగ్గజాలే భాషల మధ్య విభజన రేఖలు వద్దని, ఎక్కడ తీసినా సినిమా సినిమానే అని చెబుతుంటారు. ప్రతీ చిత్రసీమనీ గౌరవిస్తుంటారు. ఏ మాత్రం స్థాయి లేని కొంతమంది, తమ ప్రచారం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తుంటారు. అన్ని ప్రాంతాల్ని ఏకం చేసే శక్తి సినిమాకు ఉంది. మంచి సినిమా వచ్చినప్పుడు భాషలకు అతీతంగా ఆదరించడం ప్రేక్షకుల గుణం. అదే ఉత్తరాదినీ, దక్షిణాదిని ఏకం చేసే సూత్రం.