జిల్లాల పేరుతో రాజకీయం చేయాలనుకుంటున్న వైసీపీకి అదే రాజకీయంతో కౌంటర్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించుకుంది. ఇప్పటికే జిల్లాలు, రెవిన్యూ డివిజన్ల డిమాండ్లతో ఆందోళనలు చేస్తున్న టీడీపీ నేతలు .. కీలకమైన కృష్ణా జిల్లా విషయంలో రంగా పేరు పెట్టాలనే డిమాండ్‌ను మాజీ ఎమ్మెల్యే బొండా ఉమమాహేశ్వరరావు తెరపైకి తెచ్చారు. కృష్ణా జిల్లాను రెండుగా విభజించారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని నిర్ణయించారు. మచిలీపట్నం జిల్లాగా మరో జిల్లా ఉండనుంది.
అయితే ఎన్టీఆర్ స్వస్థలం మచిలీపట్నం జిల్లాలోఉంది. ఇప్పుడు టీడీపీ ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు, మరొక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. బుధవారం ధర్నా చౌక్ వద్ద బొండా ఉమ భారీ ధర్నాకు ప్లాన్ చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా ముట్టడిస్తామని ప్రకటించారు. వంగవీటి రంగా విగ్రహం లేని ప్రాంతం లేదని జిల్లాకు రంగా వంటి మహానేత పేరు పెట్టకపోతే ఆయనను జగన్ అవమానించినట్టేనని బొండా ఉమ అంటున్నారు.
రంగా కుటుంబ సభ్యులు వారికి సన్నిహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు జగన్‌కు ఒక్క మాట చెబితే పేరు పెడతారని బొండా ఉమ చెబుతున్నారు. ధర్నాకు వంగవీటి రాధను కూడా పిలుద్దామని అనుకున్నా.. అందుబాటులో లేరని బొండా ఉమ చెబుతున్నారు. రంగా పేరును వైసీపీ పెట్టడానికి ఇష్టపడకపోతే అదో రాజకీయం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రంగాను తీవ్రంగా అవమానించిన జగన్ బంధువు గౌతం రెడ్డి కీలక పదవిలో ఉన్నారు. ఇవన్నీ మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది.