బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అవుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా రెండు నెలల్లో ఎమ్మెల్సీ అయి శాసనమండలిలో అడుగు పెడుతున్నారు. ఇదెలా సాధ్యమయింది.. ? చంద్రబాబు పోటీ పెట్టకపోవడం వల్ల సాధ్యమయింది. అధికారాన్ని ఉపయోగించుకుని ఎమ్మెల్సీ సీటు సాధించడం టీడీపీకి పెద్ద కష్టం కాదు. కానీ ఒక్క ఎమ్మెల్సీతో టీడీపీ ఏం సాధిస్తుంది ?. కానీ అదే ఎమ్మెల్సీని వైసీపీకి వదిలేయడం వల్ల చాలా చేయవచ్చు. రాజకీయాల్లో గెలుపు అంటే… ఎమ్మెల్యే .. లేదా ఎమ్మెల్సీ లేదా మరో పదవిని గెలవడం మాత్రమే కాదు… ఒకటి పాచికగా వేసి.. ప్రత్యర్థి ఇంట్లో కుంపటి పెట్టడం కూడా రాజకీయమే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ విషయంలో అదే జరుగుతోంది.
ఇక వైసీపీ పాలసీల్ని డిసైడ్ చేసేది సత్తిబాబు !
బొత్స సత్యనారాయణ సూపర్ సీనియర్ లీడర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ దశలో ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడిన వ్యక్తి. అలాంటి సీనియర్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరి ఆయనను జగన్ అలా సాదాసీదాగా ఎమ్మెల్సీగా ఉంచేస్తారా ?. ఇటీవల ఆయన చెప్పినట్లుగా… బలం ఉంటే ఎవరో ఒకర్ని తెచ్చి సంతకం పెట్టేస్తే అయిపోయేది… కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి.. బొత్స లాంటి నేతను నిలబెట్టాల్సి వచ్చింది. అంటే బొత్స ప్రభావం ఏమిటో జగన్కు తెలుసన్నమాట. మరి తనను తాను తక్కువ చేసుకునేందుకు ఎందుకు ఊరుకుంటారు ?
జగన్ కన్నా సత్తిబాబుకే ప్రాధాన్యం ఇవ్వనున్న టీడీపీ !
జగన్ రెడ్డి అసెంబ్లీకి రాదల్చుకోలేదు. ఆయన భయం ఆయనది. తాము అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి అసెంబ్లీకి వచ్చిన సభ్యుల్ని అవమానించడమే తమ రాజకీయం అన్నట్లుగా చేశారు. ఇప్పుడు అలాగే చేస్తే తాను తల ఎక్కడ పెట్టుకోవాలని ఆయన రావడానికి భయపడుతున్నారు. అదే సమయంలో శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉంది. కానీ లీడర్ గా అప్పిరెడ్డిని పెట్టారు. ఆయన ఇమేజ్ వీధిరౌడీకి ఎక్కువ. ఇప్పుడు బొత్స ఆయన నేతృత్వంలో పని చేయరు. తాను మండలికి వచ్చాను కాబట్టి ఆ ప్రతిపక్ష నేత పదవి తనకు ఇవ్వాల్సిందే. అంటే… వైసీపీ తరపున ప్రభుత్వంపై పోరాడేది ఆయనే. ప్రభుత్వం కూడా ఆయనకే ప్రాధాన్యం ఇస్తుంది.
సత్తిబాబు డామినేషన్ ను సహించలేని జగన్ ఏదైనా చేస్తారు !
పార్టీలో ఏదైనా తాను చెప్పినట్లే జరగాలంటారు జగన్. అధికారంలో ఉన్నప్పుడు నడిచిపోయింది. కానీ ఇప్పుడు సాధ్యం కాదు. సత్తిబాబు లాంటి సీనియర్లను కాదనలేరు. సజ్జల లాంటి వాళ్ల మాటల విని రోడ్డున పడిపోయాక… దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న వారి మాటలు వినాల్సిందే. లేకపోతే ఆ సీనియర్లు పెట్టాల్సిన చిచ్చు పెట్టేస్తారు.దీన్ని ఆపుకునే రాజకీయ పరిణితి జగన్కు లేదు. ఈర్ష్యతో ఆయన బొత్స సత్తిబాబుతో వ్యవహరించే విధానం మారిపోతుంది. మరి బొత్స కామ్ గా ఎందుకుంటారు ?. ఈ రాజకీయ పరిణామాలను అంచనావేస్తే.. బొత్సను ఎమ్మెల్సీగా గెలిపించడం ద్వారా ట్రోజన్ హార్స్ గా వైసీపీలోకి పంపినట్లయిందని అనుకోవచ్చు.