ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆ విషయం అధికారులకు పెద్దగా తెలిసినట్లుగా లేదు. ముఖ్యంగా ఏ డిపార్టుమెంట్లో చూసినా ఇంచార్జ్గానో .. లేకపోతే మరో పోస్టులోనే పెత్తనం చెలాయించే ఓ సామాజికవర్గం వారు అసలు పట్టించుకోవడం లేదు. పదో తరగతి పరీక్షా ఫలితాలను మంత్రి బొత్సకు తెలియకుండానే గవర్నమెంట్ ఎగ్జామ్ డైరక్టర్ దేవానంద్ రెడ్డి విడుదల చేయాలనుకున్నారు. ముహుర్తం ఖరారు చేసుకుని మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ మంత్రికి సమాచారం ఇవ్వాలన్న ఆలోచనలేదు. చెప్పలేదు. అసలు విడుదల కార్యక్రమానికి ఆయనను పిలువలేదు.
కానీ తెలియకుండా ఉంటుందా ? తెలిసిన తర్వాత ఇంత అవమానాన్ని ఊరుకుంటారా ?. వెంటనే తన శాఖలో ఉన్నతాధికారులకు ఫలితాల విడుదలకు ఎలాంటి ఏర్పాట్లు చేయవద్దని ఆదేశించారు. మంత్రిగారు చెప్పారని వారు ఏర్పాట్లు చేయలేదు. ఫలితాలు విడుదల చేద్దామని.. మీడియాతో మాట్లాడి ఫోకస్ అవుదామని వచ్చిన దేవానంద్ రెడ్డికి అక్కడ ఏ ఏ ర్పాట్లు కనిపించలేదు. మీడియా ప్రతినిధులు వచ్చారు కానీ వారికి అక్కడఏర్పాట్లు కనిపించలేదు. చివరికి దేవానంద్ రెడ్డి పరిస్థితిని తెలుసుకుని… అనివార్య కారణాల వల్ల పరీక్షా ఫలితాలను విడుదల చేయలేకపోతున్నామని.. సోమవారం విడుదల చేస్తామని మీడియాకు మెసెజ్ చేశారు.
ఏపీ ప్రభుత్వంలో అస్తవ్యస్థ పరిస్థితులకు ఈ ఉదంతం ఓ ఉదాహరణగా నిలుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరీక్షలు పెట్టడమే లోపభూయిష్టంగా పెట్టారు. పరీక్షలు అయిపోయిన తర్వాత పేపర్లు లీక్ చేశారని కొంత మందిని అరెస్ట్ చేశారు. పేపర్లు లీక్ అయితే ఎందుకు పరీక్షలు రద్దు చేయలేదనే ప్రశ్న వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఫలితాల విడుదల కూడా అంతే గందరగోళం. వివిధరకాల మార్గాల్లో ఓవర్గం అన్ని చోట్లా తిష్టవేయడంతోనే ఇలాంటి సమస్య ఏర్పడిందన్న వాదన వినిపిస్తోంది.