సీనియర్ల కోటాలో మరోసారి మంత్రి పదవి పొందిన బొత్స సత్యనారాయణ తీరు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారుతోంది. విద్యాశాఖపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్షా ససమావేశానికి .. ఆ శాఖ మంత్రిగా ఆయన హాజరు కాలేదు. ఆయన ఏదైనా అత్యవసర పనిలో ఉన్నారా అంటే అదీ లేదు. ఆయన విజయనగరంలో ఉన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఫోర్ట్ ఫోలియోలు కేటాయించిన తర్వాత ఆయన విజయనగరం వెళ్లిపోయారు. తోటి మంత్రులంతా పదవి బాధ్యతలు తీసుకుంటూ సందడిగా గడుపుతూంటే బొత్స మాత్రం సైలెంటయిపోయారు.
తనకు విద్యా శాఖ ఏంటి అని బొత్స కూడా ఫీలవుతున్నట్లుగా చెబుతున్నారు. ఆయనకు విద్యాశాఖ ఏంటి అని సోషల్ మీడియాలో అదే పనిగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంగ్లిష్‌లో మాట్లాడలేకపోయిన పాత వీడియోల్ని సర్క్యూలేట్ చేస్తున్నారు. అదే సమయంలో విద్యా శాఖ అంటే చదువుతోనే పని . ఇప్పుడు తనకు ఈ తలనొప్పి ఎందుకని ఆయన అనుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. అదే సమయంలో బొత్స సత్యనారాయణ తీరు కూడా చర్చనీయాంశం అవుతోంది .
మంత్రుల ప్రమాణస్వీకారం సమయంలో ఇతర మంత్రులందరూ జగన్‌కు పాద నమస్కారం చేయడం… చేతులకు ముద్దులు పెట్టడం వంటివి చేశారు. కానీ బొత్స మాత్రం మొదట గవర్నర్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి తర్వాత జగన్ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. మామూలుగా అయితే ముందుగా గవర్నర్‌కే అభివాదం చేయాలి. బొత్స అదే ఫాలో అయ్యారు. కానీ అక్కడ పరిస్థితులు వేరు. దీన్ని బ్రేక్ చేయడంతో బొత్స పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సీఎం సమీక్షలకు కూడా డుమ్మా కొట్టడంతో మరిన్ని చర్చలు జరుగుతున్నాయి.