ఏ పెద్ద సినిమా విడుదలైన సరే..
”మేం తొలి రోజు రికార్డుల్ని కొట్టేశామోచ్” అని డబ్బా కొట్టుకోవడం అలవాటైపోయింది.
బాహుబలి జోలికి వెళ్లరు.. అదొక్కటే సంతోషం!
నాన్ బాహుబలి రికార్డులు మావే అంటుంటారు. నెం.2 మేమే అని చెప్పుకోవడంలోనూ గర్వం ఉందా?? గొప్పదనం ఉందా?? అదేంటో మరి!
సినిమా వాళ్లవన్నీ ‘కాకి’లెక్కలని జనాలకు తెలీదా?? నైజాంలో ఇంత, సీడెడ్లో ఇంత, ఆంధ్రాలో ఇంత, ఓవర్సీస్లో ఇంత… అన్నీ అంకెలేగా. అందులో నిజాలెంత? అని అడిగితే చెప్పే దమ్ము.. అక్షరాలా ఇంత అని నిరూపించిన తెగువ ఎవరిలోనైనా కనిపించాయా? దువ్వాడ జగన్నాథమ్ సినిమాకి వసూళ్లు ఇరగబడి వచ్చేశాయ్ అని అప్పట్లో దర్శక నిర్మాతలు చెప్పుకొన్నారు. కానీ.. తీగ లాగితే – ఆ సినిమా నష్టాల ఊబిలో ఉందన్న సంగతి అర్థమైంది. ఈ విషయాన్ని అటు దిల్ రాజుగానీ, ఇటు హరీష్ శంకర్ గానీ ససేమీరా ఒప్పుకోలేదు. వసూళ్లు ఫేక్ అంటారా.. మేం కాదని నిరూపిస్తాం అని గట్టిగా అరిచారు. మైకులు ఇరగ్గొట్టినంత పని చేశారు. కానీ.. ఏమైంది?? ఆ ఆవేశం చప్పున చల్లారిపోయింది.
మేం వంద కోట్లు కొట్టాం, రెండొందల కోట్లు కొట్టాం అని చెప్పుకొంటుపోతున్నారు గానీ, అటు సినీ జనాలు, ఇటు సాధారణ ప్రేక్షకులు సీరియెస్గా తీసుకోవడం లేదు. కేవలం తమ ఈగోల్ని సంతృప్తి పరుచుకొంటూ, అభిమానుల్ని సంతోష పెడుతూ ఈ అంకెల గారడీ చేస్తున్నారు తప్ప – నిజానికీ, ఊహలకూ, చెప్పే అంకెలకూ హిట్ సినిమాకీ, హిట్ చేసిన సినిమాకీ ఉన్నంత తేడా ఉంది.
వసూళ్లకు సాధికారికత ఏది? నిర్మాతలు చెబితేనే కదా తెలిసేది. ‘మా సినిమా వల్ల ఇన్ని డబ్బులు పోయాయి’ అంటూ సినిమా ఆడుతున్నప్పుడు ఏ నిర్మాతైనా చెబుతాడా? ఈ సినిమా వల్ల నష్టపోతామేమో అని బయ్యర్ అంటాడా? ఇవి రెండూ జరగవు. కాబట్టే ఇన్నిన్ని కాకి లెక్కలు వినాల్సివస్తోంది. ఇది వరకు, వంద రోజుల మోజులో ఉన్నప్పుడు డబ్బులు ఎదురిచ్చి మరీ వంద ఆడించేవారు. `మా సినిమా ఇన్ని సెంటర్లలో వందాడింది తెలుసా` అని చెప్పుకోవడానికి తప్ప అదెందుకూ ఉపయోగపడేది కాదు. ఇప్పుడూ అంతే. మా సినిమా వంద కోట్లు కొట్టింది అని చెప్పుకోవడానికి మినహా ఈ కాకి లెక్కలు ఎందుకూ పనిచేయవు.
ఓ సినిమా వసూళ్లు ఇంత అని చెప్పడానికి సాధికారిక వ్యవస్థ ఏం లేదు. టికెట్లన్నీ ఆన్ లైన్లో పెట్టి, వసూళ్లు కూడా ఆన్లైన్లోనే చూపించి, చూపించిన వసూళ్లకు పన్ను కట్టాల్సిందే అనే రూల్ ఉంటే తప్ప.. అసలు లెక్కలు బయటపడవు. ఇన్నాళ్లు వంద సెంటర్ల కోసం కొట్టుకొన్న వాళ్లు, ఇప్పుడు వంద కోట్ల క్లబ్ కోసం కొట్టుకొంటున్నారంతే. కొన్నాళ్లకు ఇదీ ఉండవు. మరోటేదో వస్తుంది. ఇవన్నీ సినిమాలు తీస్తున్నవాళ్లకు గానీ, చూస్తున్నవాళ్లకు కాదు. ఏది మంచి సినిమానో, కాదో.. వాళ్లకు తెలుసు. ఈ డ్రామాలు టికెట్ లేని వినోదం మాత్రమే. ఈ విషయాన్ని సినిమాలు తీస్తున్నవాళ్లు తెలుసుకోవాలి.