ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. తనకు దక్కని ప్రేమ ఇంకెవరికి దక్కకూడదన్న ఉన్మాదంతో ఓ యువకుడు విశాఖలో యువతిని గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి కారణం అదే మొదటి ఘటన కాదు. ఏపీలో వరుసగా ఇలాంటి ప్రేమోన్మాద హత్యలు చోటు చేసుకుంటూండటమే కారణం. విజయవాడలో దివ్య తేజస్విని హత్య ఘటన ఇంకా కళ్ల ముందు కదలడాతూనే ఉంది. పోలీసులు.. ప్రభుత్వం ఇచ్చిన.. మళ్లీ జరగనివ్వబోమన్న్ భీకరమైన ప్రకటనలు పచ్చిగానే ఉన్నాయి. కానీ మరో ప్రేమోన్మాది తెగబడ్డాడు. తాను చేయబోతోంది తప్పు అనే భయం మనసులో లేకుండా ఉన్మాదానికి తెగబడ్డాడు.
ఏపీలోనే ఎందుకు ఈ ఉన్మాదం వెర్రితలలు వేస్తోంది..!?
ఏడాదిన్నర కాలంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్మాదం వెర్రితలు వేస్తోంది. చిన్నారులపై దారుణాల దగ్గర్నుంచి యువతులను నిర్దాక్షిణ్యంగా చంపడం వరకూ.. నిరాటకంగా సాగిపోతున్నాయి. ఎవరికీ భయం అనేది లేకుండా పోయింది. తాము నేరం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం నేరస్తుల్లో పోయింది. ఎలాగైనా బయటపడవచ్చన్న ఆలోచన వారికి వచ్చేసింది. ఫలితంగా… హత్యలు పెరిగిపోతున్నాయి. దారుణాలు జరిగిపోతున్నాయి. ఎప్పుడు ఘటన జరిగినా… పోలీసులు.. ప్రభుత్వం.. తెర ముందుకు వచ్చిన కఠిన చర్యలు తీసుకుంటామని.. మరోసారి జరగనివ్వబోమని చెబుతూ ఉంటారు. కానీ.. మళ్లీ మళ్లీ జరిగిపోతున్నాయి.
నేరగాళ్లకు రాజ్యంలో భరోసా లభించడమే కారణమా..?
కేసుల సంఖ్య తగ్గిపోయిందని ఓ వైపు పోలీసులు చెబుతూంటారు. కానీ కళ్ల ముందు జరుగుతున్న దారుణాలకు మాత్రం లెక్కే ఉండటం లేదు. కనీసం పది మంది యువతులు ఈ మధ్య కాలంలో ప్రేమోన్మాదానికి ప్రాణాలు కోల్పోయారు. కానీ.. ఎక్కడైనా ఒక్క చోటంటే.. ఒక్కచోట కూడా.. ఎవరికీ కఠిన శిక్ష పడిన దాఖలాల్లేవ్. రాజకీయ పరమైన కారణాలతో పోలీసులు చాలా కేసుల్లో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. పట్టపగలు హత్యాయత్నం చేసిన వారికే స్టేషన్ బెయిల్ ఇచ్చేంత సులువుగా చట్టాలు అమలు చేస్తున్న సమయంలో.., నేరగాళ్లకు భరోసా లభించడంలో ఆశ్చర్యం లేదు.
దిశ చట్టాలు కామెడీ కావడానికి కారణం ఎవరు..?
పొరుగు రాష్ట్రంలో ఓ దిశ ఘటన జరిగితే.. ఏపీలో ప్రభుత్వం స్పందించి అమల్లోకి రాని దశ చట్టాన్ని తెచ్చింది. ఆ చట్టం పేరుతో ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టారు. పోలీసులు సైతం గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ చట్టం అమల్లోకి రాలేదని ఎవరూ చెప్పరు. కానీ ప్రజల్ని మభ్య పెట్టేస్తూ ఉంటారు. నేరస్తుల్ని అలా తప్పించుకుపోతూనే ఉంటారు. వారంలో ఉరి శిక్ష వేస్తామన్న ఆ చట్టం అంత కామెడీ అయిపోయి.. నేరస్తులు చెలరేగిపోవడానికి కారణం ఎవరన్నదానిపై ప్రత్యేకంగా విశ్లేషణ చేయాల్సిన పని లేదు. చట్టాలు.. ప్రభుత్వాలను బట్టి కాకుండా.. వాటంతటకు అవి పని చేసిన రోజునే.. రాజ్యంలో శాంతిభద్రతలు ఫరిడవిల్లువతాయి. కొంత మందికే చట్టాలు అమలు చేయాలనుకుంటే దారుణాలే జరిగిపోతాయి. ఒకసారి ఇలాంటి పరిస్థితులు ఏర్పడిన తర్వాత చక్కదిద్దడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అరాచకం రాజ్యం ఎలాల్సిందే. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. ఆడపిల్లలకు.. చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. ఈ విషయాన్ని జరుగుతున్న ఘటనలే నిరూపిస్తున్నాయి.