ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాల మొదటి రోజు సామాన్య ప్రజల కోసం కేటాయించిన కోటగుమ్మం ఘాట్ వద్ద పూజలు చేసి పుష్కరస్నానం చేసినప్పుడు ఒక లఘుచిత్రం చిత్రీకరించారని అందుకే సుమారు రెండు గంటలకుపైగా గేట్లు తెరవకుండా ప్రజలను బయట నిలిపివేయడంతో త్రొక్కిసలాట జరిగి 27మంది మరణించారని కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈరోజు పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మరొక తాజా ఆరోపణ చేసారు. ఆ లఘుచిత్రానికి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను స్వయంగా చిత్రీకరించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పుష్కరస్నానం చేస్తుంటే ఎవరో మీడియా వాళ్ళో లేక ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖకు చెందిన వాళ్ళో ఫోటోలు తీసుకోవడం, ఇంకా వీలయితే వీడియో చిత్రీకరించడం సహజమే. కానీ బయట లక్షలాది ప్రజలు త్రొక్కిసలాడుకొంటుండగా లోపల ఘాట్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సినిమా దర్శకుడిని పెట్టుకొని మరీ తన కార్యక్రమాన్ని చిత్రీకరించడం నిజమయితే అది క్షమార్హం కాని నేరమేనని చెప్పక తప్పదు. రఘువీరారెడ్డి చేసిన ఈ ఆరోపణలు చాలా తీవ్రమయినవి కనుక చంద్రబాబు నాయుడు, బోయపాటి శ్రీను కూడా దానిపై వివరణ ఇస్తే ఆయన చేస్తున్న ఆరోపణలు నిజమో కాదో ప్రజలే నిర్ధారించుకొంటారు.