ఒక్కో దర్శకుడిదీ ఒక్కో శైలి. ఆ స్టైలే.. వాళ్ల ప్రాణం. దాన్ని దాటి బయటకు రావడానికి ప్రయత్నించరు. ప్రయత్నించినా రాలేనూ లేరు. కానీ అప్పుడప్పుడూ అలాంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం బోయపాటి శ్రీను చేస్తోంది అదే. ఈ దర్శకుడి పేరు చెప్పగానే.. భద్ర, సింహా, లెజెండ్, సరైనోడు సినిమాలు గుర్తొస్తాయి. మాస్‌ని ఓ పట్టు పట్టే దర్శకుడు బోయపాటి. ఆయన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ కావల్సినన్ని ఉంటాయి. టైటిల్ లోనే `మాసిజం` చూపించడంలో దిట్ట. అయితే.. తొలిసారి ఓ క్లాస్ టచ్ ఉన్న పేరు పెట్టారు. అదే.. జై జానకీ నాయక. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఈ పేరు ఖరారు చేశారు. బోయపాటి తన సినిమా కోసం క్లాస్ టైటిల్‌ని వెదికే పనిలో ఉన్నాడని తెలుగు 360 ముందు నుంచీ చెబుతోంది. ఇప్పుడు అదే నిజమైంది కూడా. టైటిల్లో క్లాస్ ఉన్నా.. సినిమా కూడా అలానే ఉంటుందనుకొంటే పొరపాటే. బోయపాటి శ్రీను మార్క్ ఈ సినిమాలో అడుగడుగునా కనిపిస్తుందట. అయితే.. కుటుంబ బంధాలు, ప్రేమ… వీటికీ చోటుందని అందుకే కుటుంబ ప్రేక్షకుల్నీ ఆకర్షించే ఉద్దేశంతో క్లాస్ టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీను లుక్, డైలాగ్ డెలివరీ.. పూర్తిగా మారిపోయాయట. అల్లుడు శీనుతో పోలిస్తే… ప్రతి విభాగంలోనూ బెల్లంకొండ ఛేంజ్ ఓవర్ ప్రస్పుటంగా దర్శనమిస్తుందని చిత్రబృందం తెలిపింది.