వినయ విధేయ రామ డిజాస్టర్ ప్రభావం బోయపాటి శ్రీను ఇమేజ్‌పై బాగా పడింది. ఇప్పుడు తన స్టామినా నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దానికి బాలకృష్ణ సినిమానే దారి. బాలకృష్ణ – బోయపాటిలది విజయవంతమైన జోడీ. బాలయ్యని ఈతరంలో బోయపాటి చూపించినట్టు మరే దర్శకుడూ చూపించలేదన్నది నిజం. అలానే.. బాలయ్య సినిమాల్లోనే బోయపాటి స్టైల్ నూటికి నూరుపాళ్లూ ఆవిష్కృతమైందన్నది అంతే నిజం. అందుకే… ఈ సినిమాపై బోయపాటి చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
అయితే… ఇప్పుడు బాలకృష్ణ సినిమాపై బోయపాటికి కొత్త బెంగ పుట్టుకొచ్చింది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సీజన్ మొదలైంది. బాలయ్య మూడ్ మొత్తం అటువైపు టర్న్ అయిపోయింది. అందుకే ఎన్నికలు అయ్యేంత వరకూ బోయపాటి సినిమాని పట్టాలెక్కించే ఛాన్స్ లేదు. మే వరకూ ఆగడానికి బోయపాటికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే… ఈమధ్యలో బాలయ్య మూడ్ ఎలా మారిపోతుందో అర్థం కాని పరిస్థితి. బోయపాటి ఇప్పటికే బాలయ్యకు కథ చెప్పాడు. ఆ కథపైనే వర్క్ జరుగుతోంది. ఈకథలో పొలిటికల్ అంశాలు చాలా ఉన్నాయి. ఎన్నికల్లో టీడీపీ గెలిచి, బాలయ్య కూడా హిందూపురం ఎం.ఎల్.ఏ గా మరోసారి కూర్చుంటే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ సీన్ రివర్స్ అయితే మాత్రం… ఇప్పుడు సిద్ధం చేస్తున్న కథని పట్టాలెక్కించడంలో అర్థం ఉండదు. రాజకీయ నేపథ్యంలో కథల పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. చేతిలో అధికారం ఉంటే, ఏం చెప్పినా జనం వింటారు. అదే లేకపోతే.. నవ్వులపాలైపోతారు. అందుకే బోయపాటి ఇప్పుడు సందిగ్థంలోపడినట్టు తెలుస్తోంది. స్క్రిప్టు పూర్తయ్యాక `ఇప్పుడు ఈ కథ వద్దు` అని బాలయ్య చెబితే.. ఏం చేయాలి? అనేదే తన సందేహం. పైగా బాలయ్య మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. ఆ మూడ్‌కి తగ్గట్టుగా తానూ మారిపోవాలి తప్ప, ఎదురు చెప్పే ఆస్కారమే ఉండదు. ఎన్నికలు పూర్తయి, రిజల్ట్ వచ్చేంత వరకూ బోయపాటికి ఈ టెన్షన్ తప్పదు.