ఈమధ్య బ్రహ్మానందం వెండి తెరపై పెద్దగా కనిపించడం లేదు. ఆయన హవా తగ్గిందన్నది ఇండ్రస్ట్రీ వర్గాల గుసగుస. కానీ… బ్రహ్మీ చేస్తున్న సినిమాలు చూస్తుంటే, ఆయన కొత్త పంథాలో వెళ్తున్నాడేమో అనిపిస్తోంది. కృష్ణవంశీ `రంగమార్తాండ`లో ఆయన తొలిసారి విషాదభరితమైన పాత్ర పోషిస్తున్నారు. `పంచతంత్రం`లోనూ ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో బ్రహ్మీ వేద వ్యాస్గా కనిపించనున్నారు. వేద వ్యాస్ అనగానే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గుర్తొస్తారు. కానీ.. ఇది అలాంటి పాత్ర కాదు.
అరవై ఏళ్ల వయసులో.. కెరీర్ ప్రారంభించే ఓ పెద్దాయన పాత్ర ఇది. ఆల్ ఇండియా రేడియోలో పనిచేసి, రిటైర్ అయిన ఓ వ్యక్తి… అరవై ఏళ్ల తరవాత తన జీవితాన్ని ఎలా మలచుకోవాలనుకుంటున్నాడో ఈ పాత్రతో చూపించబోతున్నారు. ఈరోజు బ్రహ్మానందం పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. బ్రహ్మీ పాత్రని పరిచయం చేస్తూ ఓ టీజర్ కూడా విడుదల చేశారు. పంచతంత్రం.. పేరుకు తగ్గట్టే ఐదుగురి కథ. బ్రహ్మానందం, స్వాతి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్… కీలక పాత్రలు పోషించారు. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. త్వరలోనే విడుదల చేయనున్నారు.