వైసీపీ హయాంలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు ఎంత లంచగొండులుగా మారిపోయారో అనడానికి ఇదొక ఉదాహరణ అనుకోవచ్చు. చంద్రబాబునాయుడు కుప్పంలో ఇల్లు కట్టుకోవడానికి ఓ శాంతిపురం మండలంలో కొంత స్థలం కొన్నారు. అది రహదారి పక్కనే ఉంటుంది. అయితే వ్యవసాయభూమి. ఇల్లు కట్టుకోవాలంటే ల్యాండ్ కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. చాలా కాలం పాటు సర్వేయర్ నాన్చాడు ., చివరికి కోరిక బయట పెట్టుకున్నాడు. లంచం ఇస్తేనే పని అవుతుందన్నాడు. అది చంద్రబాబు ఇల్లు అని తెలిసినా సరే ఆయన తగ్గలేదు.చివరికి లక్షా ఎనభై వేలు తీసుకుని ల్యాండ్ కన్వర్షన్ చేశారు.
చంద్రబాబు ఇంటి నిర్మాణ పనులను స్థానిక నేతలే చూసుకున్నారు. దీంతో డబ్బులు లంచం ఇచ్చిన విషయం బయటకు రాదని అనుకున్నారు.కానీ ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో తన ఇంటి నిర్మాణం వద్దకు వెళ్లారు. అప్పుడు పార్టీ నేతల వద్ద ఈ అంశం చర్చకు వచ్చింది. ఓ రైతు .. తన భూమిని సర్వే చేయడానికి లంచం అడిగారనే ఫిర్యాదు కూడా రావడంతో వెంటనే రంగంలోకి దిగారు. విచారణ జరిపి.. నిజమని తేల్చి అసిస్టెంట్ సర్వేయర్ ను సస్పెండ్ చేశారు.
కానీ అంత ధైర్యంగా లక్షల్లో ఆ అసిస్టెంట్ సర్వేయర్ లంచాలు వసూలు చేయడని.. పెద్ద నెట్ వర్క్ ఉంటుందన్న అనుమానాలు మాత్రం ఉన్నాయి. నిజానికి పెద్ద మాఫియాలాగా మారిపోయింది. ప్రభుత్వ పెద్దలే శాఖలకు టార్గెట్లు పెట్టి లంచాలు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ఇంటికే ఈ పరిస్థితి వస్తే.. ఇక సామాన్యులు ఎంత ఇబ్బంది పడి ఉంటారో చెప్పాల్సిన పని లేదు.