ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 12 పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాయని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. కాదు కాదు మేం 14సీట్లు గెలవబోతున్నాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్న తరుణంలో బీజేపీ, బీఆర్ఎస్ రైతు రాజకీయం మొదలుపెట్టాయి.
తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు వేగంగా అడుగంటి పోతున్నాయి. సరిగ్గా దీన్నే ఆసరగా తీసుకొని కేసీఆర్ రాజకీయం మొదలుపెట్టారు. కృష్ణా నదీ జలాల పంపకం మీద రాజకీయం చేయాలనుకున్నా అది వర్కవుట్ కాలేదు. అందుకే ఒకే సభ పెట్టి సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు రాబోతున్న ఎంపీ ఎన్నికలు బీఆర్ఎస్ కు చావో రేవో అన్నట్లు తయారయ్యాయి. కనీసం ఒక్క సీటు అయినా గెలుస్తుందా అన్న అనుమానాలున్న సమయంలో కేసీఆర్ ఫాంహౌజ్ నుండి బయటకు రావాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి.
పైగా పార్టీ నుండి సీనియర్లు కేకే, కడియం వంటి వారు కూడా వెళ్లిపోతున్న నేపథ్యంలో… లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే లీడర్లు సైతం మానసికంగా భయంలో పడిపోయారు. క్యాడర్ కూడా గందరగోళంగా ఉంది. దీంతో క్యాడర్ లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా కేసీఆర్ గ్రౌండ్ కు వెళ్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇప్పటికే నల్గొండలో రైతు పరామర్శ యాత్ర చేసిన కేసీఆర్, వారం రెస్ట్ తీసుకొని ఏప్రిల్ 5న కరీంనగర్ లో పర్యటించాలని భావిస్తున్నారు.
ఎన్నిలొస్తున్న తరుణంలో తానేక్కడ వెనకపడిపోతానన్న భయంతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రైతుదీక్షకు రెడీ అయ్యారు. కేసీఆర్ వచ్చే లోపే తాను దీక్షకు దిగుతున్నారు. కలెక్టరేట్ వద్ద రైతుదీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఓట్ల వేటలో వెనకపడొద్దన్నదే బండి దీక్షలోనూ అసలు విషయం అనేది ఓపెన్ సీక్రెట్.
అయితే, బీఆర్ఎస్ బీజేపీలు రైతుల పేరుతో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్ సైలెంట్ గా ఉండటంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ వాగ్ధాటికి, బండి సంజయ్ అటాకింగ్ కు తగ్గట్లుగా కాంగ్రెస్ నుండి కౌంటర్ పడలేదని… ఇదే కంటిన్యూ కాంగ్రెస్ సైడ్ అయిపోవటం పక్కా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.