హైడ్రా విషయంలో విమర్శలకు తావు లేకుండా చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలు అలా ఒక ఆరోపణను తెరపైకి తీసుకురాగానే వెంటనే దానిపై తన స్టైల్లో స్పందిస్తున్నారు. అధికారుల తీరును తప్పుపట్టిన కిషన్ రెడ్డికి వెంటనే వారిపై చర్యలకు ఆదేశిస్తూ ఆయనకు అస్త్రం లేకుండా చేశారు. ఇక కేవలం పేదవాళ్లవే కూలుస్తున్నారని పెద్దవాళ్ళను వదిలేస్తున్నారంటూ బీఆర్ఎస్ విమర్శలు మొదలు పెట్టగా తన సొంత సోదరుడి ఇంటికి నోటీసులు పంపించి అందరిని ఆశ్చర్యపరిచారు.
హైడ్రా పేరుతో రేవంత్ సర్కార్ హైడ్రా చేస్తోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ అసమర్ధత చర్చకు రాకుండా ఉండేందుకు హైడ్రా పేరుతో ఏదో చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారని..అక్రమ కట్టడాలను కూల్చడం కాదు..దమ్ముంటే ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరినంత పని చేశారు.కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందో, హైడ్రా పనితీరుపై మరింత విశ్వాసం కల్పించేందుకు కోసమో.. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.
ఇక, బీఆర్ఎస్ ఈ విషయంలో రేవంత్ ఫ్యామిలీని మరోసారి టార్గెట్ చేసింది. రేవంత్ సోదరుల నివాసాలు ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్నాయని వాటి సంగతేంటి అని ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి , పార్టీలో చేర్చుకోవాలనే వ్యూహంతో హైడ్రాను ఉపయోగిస్తున్నారని హరీష్ ఆరోపించారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా రేవంత్ సోదరుడి ఇంటికి కూడా హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వడంతో హైడ్రాపై బీఆర్ఎస్ చేస్తోన్న విమర్శల్లో ఎలాంటి పస లేదని తేలిపోయింది. దీంతో హైడ్రా విషయంలో బీజేపీ – బీఆర్ఎస్ నేతలు తాజా పరిణామాలతో ఎలా స్పందిస్తారోనని చర్చ జరుగుతోంది.