బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగినంత కాలం ఆ రెండుపార్టీల హవా నడిచింది. అయితే అది కేసుల వరకూ వెళ్లింది. చివరికి ఇద్దరూ రాజీపడక తప్పలేదు. ఇప్పుడు వారిద్దరూ యుద్ధం ఆపేసి… కనిపించని స్నేహం పెంచుకుంటూంటే కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటోంది. తెలంగాణలో అదే జరుగుతోంది. విపక్షాల సమావేశం ఉన్న రోజే ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలిసిన కేటీఆర్ .. కలవాల్సింది పార్టీలు కాదు ప్రజలని ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశారు.
మరి అదే నిజం అయితే ఇంత కాలం ఆ పార్టీలతో కలిసేందుకు ఎందుకు రాష్ట్రాల పర్యటనలు చేశారన్నది కేటీఆర్ చెప్పాల్సి ఉంది. వారి రాజకీయ అవసరాలేమిటన్న విషయం పక్కన పెడితే… యుద్ధం ఆపేశారని అందరికీ తెలుస్తోంది. దీని వల్ల ఆ రెండు పార్టీలూ నష్టపోతున్నాయి. కేసీఆర్ , కేటీఆర్ ఇప్పుడు బీజేపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా .. యుద్ధం ప్రకటించకుండా ఉండటం బీజేపతో పాటు బీఆర్ఎస్కూ నష్టమే. ఎందుకంటే.. రెండు పార్టీల మధ్య ఉద్రిక్తత సడలిపోవడంతో రెండు పార్టీలు ఒక్కటేనన్నప్రచారం ఊపందుకుంటోంది.
ఇది కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తోంది. కర్ణాటకలో వచ్చిన గెలుపుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుంజుకుంటోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనన్న ప్రచారంతో నేతలంతా పోలోమని కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీని వల్ల తెలంగాణలో ముఖాముఖి పోరు జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోరాటం జరుగుతుంది. దీని వల్ల ఎక్కువ నష్టపోయేది..అధికారానికి ముప్పు ఏర్పడేది బీఆర్ఎస్ పార్టీకే. బీజేపీ పై బీఆర్ఎస్ ముద్ర పడితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కన్సాలిడేట్ అవుతాయి. ఓట్లు చీలిపోతే బీఆర్ఎస్ విజయానికి ఢోకా ఉండదు. కానీ బీఆర్ఎస్, బీజేపీ కలుస్తూండటం వల్ల. ..ముఖాముఖి పోరుకు చాన్స్ ఏర్పడుతోంది. అంతిమంగా ఇది బీఆర్ఎస్ కు నష్టమే.