ప్రజలను కన్ఫ్యూజ్ చేయడంలో వైసీపీ, బీఆర్ఎస్ లు తమకు ఎవరూ సాటిలేరు అనే తరహాలో పోటీపడుతున్నాయి. వాస్తవాలకు ముసుగు తొడిగి అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ తప్పుడు సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఇందుకు ఆయుధంగా తమ అనుకూల పత్రికలను కావాల్సినంతగా వాడుకుంటున్నాయి. ఐదేళ్లు సోషల్ మీడియా విన్యాసాలతో స్వయం సంతృప్తి పొందిన ఈ రెండు పార్టీలు అధికారం కోల్పోయాక కూడా అదే పంథాను అనుసరిస్తున్నాయి.
బాపట్లలో టీడీపీ బరితెగింపు అని సాక్షి పతాక శీర్షికన ఓ కథనం ప్రచురించింది. భట్టిప్రోలు ఎస్సై చొక్కాను టీడీపీ కార్యకర్త పట్టుకున్నారంటూ వార్తను ప్రచురించారు. కానీ, వాస్తవం మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణను పోలీసులు నిలువరిస్తుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయినా.. తమకు నచ్చినట్లుగా వీడియో కట్ ను చేసుకొని సోషల్ మీడియా ద్వారా సర్కార్ ను అప్రతిష్టపాలు చేసేందుకు దీనినొక అస్త్రంగా వాడుకోవాలని చేసిన ప్రయత్నం వికటించింది. వాస్తవ విషయాన్ని చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో సర్కార్ పై సాక్షి తప్పుడు రాతల విద్వేషం మరోసారి బయటపడింది.
Also Read : బీఎల్ సంతోష్ వచ్చేశాడు.. బీఆర్ఎస్ లో ఆందోళన!
ఏపీలో వైసీపీ అనుకూల పత్రిక తీరు ఇలా ఉంటే, తెలంగాణలో బీఆర్ఎస్ అనుకూల నమస్తే తెలంగాణ పత్రిక వైఖరి గొప్పగా ఏమి లేదు. రేవంత్ రెడ్డి – భట్టి విక్రమార్కల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని కాంగ్రెస్ లో మంటలు రేపే కథనాలను వండివార్చుతోంది. నేతలంతా కలిసిపోయి పాలనపై దృష్టిపెడుతున్నా..ఇంకా ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులను అయోమయానికి గురి చేసేలా కథనాలు ప్రచురిస్తోంది. ఇక, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ కోతలు మొదలు అయ్యాయంటూ .. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని కొద్ది రోజుల కిందట విస్తృతంగా ప్రచారం చేసింది. సోషల్ మీడియా ద్వారా జనాలు వాస్తవాలు తొందరగానే గ్రహిస్తున్నారు.. కానీ ,ఇరు పార్టీల అనుకూల పత్రికలు మాత్రం ప్రజలను అమాయకులను చేసేలా తప్పుడు కథనాలకు ప్రాధాన్యత ఇస్తుండటం విమర్శలకు తావీస్తోంది.